వాట్సాప్‌లో పొక్కి.. సెబీకి చిక్కి!

కంపెనీల ఆర్థిక ఫలితాల లీక్‌పై దర్యాప్తు
రంగంలోకి ఎక్స్ఛేంజీలు సైతం
దాదాపు 24 కంపెనీల సమాచారం బయటకు
జాబితాలో బ్లూచిప్‌ కంపెనీలు ఏడు
అందులో డాక్టర్‌ రెడ్డీస్‌, సిప్లా, యాక్సిస్‌ బ్యాంక్‌
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టాటా స్టీల్‌, విప్రో, బజాజ్‌ ఫైనాన్స్‌లూ
ఏమయింది..
దాదాపు రెండు డజన్లకు పైగా కంపెనీల ఆర్థిక ఫలితాల వివరాలు.. అధికారిక వెల్లడికి ముందే వాట్సాప్‌ గ్రూప్‌ల ద్వారా బయటకు వచ్చాయి. ఆయా కంపెనీల షేర్ల ట్రేడింగ్‌ వివరాలను సెబీ పరిశీలించడం మొదలుపెట్టింది. అంతే కాదు.. ఇందులో పాల్గొన్న వ్యక్తుల కాల్‌ డేటా రికార్డు(సీడీఆర్‌)లను సైతం బయటకు తీయాలని భావిస్తోంది.
ఏ కంపెనీలు
ఇప్పటికే ఎక్స్ఛేంజీలు గత 12 నెలల్లో ఆ కంపెనీల ట్రేడింగ్‌ గణాంకాలను విశ్లేషించడం మొదలుపెట్టాయి. ఎక్కడైనా సెబీ నిబంధనలు ఉల్లంఘించాయోమోనన్న కోణంలో దర్యాప్తు మొదలుపెట్టాయి. ఇందు కోసం డాటా వేర్‌హౌస్‌, ఇంటలిజెన్స్‌ సిస్టమ్స్‌ను వాడుకుంటున్నాయి. విచిత్రం ఏమిటంటే బ్లూచిప్‌ కంపెనీల వివరాలు సైతం బయటకు వచ్చాయని తెలుస్తోంది.
3 రోజులు ముందే డాక్టర్‌ రెడ్డీస్‌ ఫలితాలు
రాయిటర్స్‌ నివేదిక ప్రకారం.. డాక్టర్‌ రెడ్డీస్‌ ఆర్థిక ఫలితాల ప్రకటనకు ముందే ఒక ప్రైవేట్‌ వాట్సాప్‌ గ్రూప్‌లో ఆ కంపెనీ రూ.50 కోట్ల కంటే పైన నష్టాన్ని నమోదు చేస్తుందని సమాచారం లీక్‌ అయింది. ఆ తర్వాత జులై 27న ప్రకటించిన డాక్టర్‌ రెడ్డీస్‌ లాభం రూ.58 కోట్లుగా ఉంది. ఆ కంపెనీ షేర్లు 4.4 శాతం దాకా నష్టపోయాయి. నిర్దిష్ట సమాచారం అంటే.. నికర లాభాలు, ఆదాయాలు, నిర్వహణ మార్జిన్ల గణాంకాలు ఆ వాట్సాప్‌ గ్రూప్‌లో లభ్యం కావడం గమనార్హం. బోనస్‌ షేర్లు లేదా ఆదాయ అంచనాలు సైతం వాటిలో ప్రత్యక్షమయ్యాయట.
నిబంధనలు ఏం చెబుతున్నాయ్‌
సెబీ నిబంధనల ప్రకారం నమోదిత కంపెనీల అన్ని ఆర్థిక వివరాలు కేవలం స్టాక్‌ ఎక్స్ఛేంజీల ద్వారానే బయటకు రావాలి. ఎందుకంటే ఆ వివరాలు షేర్ల ధరలపై ప్రభావం చూపుతాయి కాబట్టి.అయితే ఇక్కడ మాత్రం వాట్సాప్‌లోని కొన్ని ప్రైవేటు గ్రూపుల ద్వారా ఆర్థిక ఫలితాల వెల్లడికి ముందే ఆ సమాచారం బయటకు వచ్చిందని తెలుస్తోంది. సాధారణంగా అంచనాలు ముందే బయటకు వస్తాయి. కానీ ఈ సమాచారం దాదాపు ఆర్థిక ఫలితాలకు దగ్గరగా ఉండడమే దర్యాప్తునకు దారి తీస్తోంది.
కాల్‌ డేటా రికార్డులు.. అంటే
కీలక ఆర్థిక సమాచారాన్ని సర్క్యులేట్‌ చేసిన అందరి వ్యక్తుల కాల్‌ డేటా రికార్డులను పరిశీలించాలని సెబీ భావిస్తోంది. సెబీకి ఆ మేరకు అధికారాలు ఉన్నాయి. అయితే ఆ వ్యక్తులు ఏం మాట్లాడుకున్నారన్న విషయాన్ని యథాతథంగా టెలికాం కంపెనీల నుంచి పొందడానికి అధికారం లేదు. కేవలం ఆయా సంస్థల లేదా వ్యక్తుల మధ్య ఎన్ని సార్లు సంభాషణ జరిగింది అన్నది తెలుస్తుంది. ఏదైనా తప్పు చేస్తారని ఆధారాలు ఉంటేనే ఫోన్‌ రికార్డింగ్‌ చేయడానికి సెబీకి అధికారం ఉంటుంది.
గతంలోనూ ఇలాగే..
సాధారణంగా నమోదిత కంపెనీల సమాచారాన్ని ఎస్‌ఎమ్‌ఎస్‌లు, వాట్సప్‌, ఇతరత్రా సామాజిక మాధ్యమాల ద్వారా పంపుతుంటారు. ఈ సమయంలో కొన్ని బ్రోకరేజీ సంస్థలు, ఎక్స్ఛేంజీల పేర్లను దుర్వినియోగం చేస్తుంటారు కూడా. ఇప్పటికే ఈ తరహా కేసుల్లో సెబీ చర్యలు తీసుకుంది. ఉదాహరణకు సెబీ వద్ద రిజిస్టర్‌ కాకుండా పెట్టుబడుల సలహాలను ఇస్తున్న ఎమ్‌సీఎక్స్‌ బిజ్‌ సొల్యూషన్స్‌, మనీవరల్డ్‌ రీసెర్చ్‌ అండ్‌ అడ్వైజరీ, గ్లోబల్‌ మౌంట్‌ మనీ రీసెర్చ్‌ అండ్‌ అడ్వైజరీ, గోక్యాపిటల్‌, క్యాపిటల్‌వయా గ్లోబల్‌ రీసెర్చ్‌లపై చర్యలు తీసుకుంది. బల్క్‌ ఎస్‌ఎమ్‌ఎస్‌ల ద్వారా ట్రేడింగ్‌ సలహాలను అనధికారికంగా పంపే వారిపై చర్యలు తీసుకోవడానికి ఆగస్టులో ట్రాయ్‌ సహాయాన్ని కూడా తీసుకుంది.
త్వరలో నిషేధం!
ఎస్‌ఎమ్‌ఎస్‌లు, వాట్సాప్‌, ట్విటర్‌, ఫేస్‌బుక్‌ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా అనధికార ట్రేడింగ్‌ సలహాలను నిషేధించడం కోసం గతేడాది సెబీ ఒక చర్చాపత్రాన్ని తీసుకువచ్చింది. సెక్యూరిటీ మార్కెట్‌కు సంబంధించిన ఆటలు, లీగ్‌లపైనా నిషేధం విధించాలని అందులో పేర్కొంది. అయితే దీనిపై తుది నిబంధనలు ఇంకా రావాల్సి ఉంది.

Related posts

Leave a Comment