28నే మెట్రో

ప్రధాని పర్యటన ఖరారు… మియాపూర్‌లో ప్రారంభం
అక్కడి నుంచి కూకట్‌పల్లికి రైలులో రాకపోకలు
రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా అందిన సమాచారం
ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటనపై రాష్ట్ర ప్రభుత్వానికి అధికారిక సమాచారం అందింది. ఈనెల 28న, మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు ఆయనతో వస్తారు. గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఇతర ప్రముఖులు ప్రధానికి స్వాగతం పలుకుతారు. పరిచయాల అనంతరం 3.25కి వారంతా మియాపూర్‌ మెట్రోరైల్‌ స్టేషన్‌కు చేరుకుంటారు. మోదీ మెట్రో రైలును ప్రారంభించి, మియాపూర్‌ నుంచి కూకట్‌పల్లికి ఐదు కిలోమీటర్లు ప్రయాణిస్తారు. అక్కడి నుంచి మళ్లీ మెట్రోలోనే మియాపూర్‌కు వస్తారు. తర్వాత స్టేషన్‌ ఆవరణలో ఈ ప్రాజెక్టుపై ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకిస్తారు. అక్కడి నుంచి ఆయన హెలికాప్టర్‌లో హెచ్‌ఐసీసీకి చేరుకుని, ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు రోడ్డుమార్గంలో ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకుంటారు. అక్కడ విందు అనంతరం రోడ్డు మార్గంలోనే 8.30కి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళతారు. గవర్నర్‌, సీఎం ఇతర ప్రముఖులు ఆయనకు వీడ్కోలు పలికిన అనంతరం… ప్రత్యేక విమానంలో మోదీ దిల్లీకి పయనమవుతారు. హెచ్‌ఐసీసీ నుంచి ఫలక్‌నుమాకు రోడ్డు మార్గమే భద్రం, అనుకూలమని ప్రత్యేక భద్రతా దళం (ఎస్పీజీ) నివేదిక ఇవ్వడంతో… ప్రధాని కార్యాలయం అందుకు మొగ్గు చూపినట్లు తెలిసింది.

 

Related posts

Leave a Comment