తమిళనాట భారీ వర్షాలు

తమిళనాడును మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన గంటల్లోనే రాష్ట్రంలోని తీరప్రాంత జిల్లాలతో పాటు చెన్నై నగరంలో వర్షాలు మొదలయ్యాయి. దీనికి ‘ఓఖి’ తుపాను తోడవటంతో కన్యాకుమారి జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. సుమారు 500 చెట్లు రోడ్లకు అడ్డంగా పడ్డాయి. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. పెద్దసంఖ్యలో విద్యుత్తు స్తంభాలు ఒరగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్తు సరఫరాను పూర్తిగా నిలిపేశారు. తుపాను కారణంగా కన్యాకుమారితో పాటు పలుప్రాంతాల్లో మొత్తం అయిదుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. అధికారులు వెంటనే సహాయక చర్యల్లో నిమగ్నమై రోడ్లపై పడ్డ చెట్లను తొలగిస్తున్నారు. శుక్రవారం వరకు ఈ వానలు కొనసాగుతాయని చెప్పారు.

తీరప్రాంతాల ప్రజలు మరోసారి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. ఐఎండీ అధికారులు కన్యాకుమారిలో హైఅలర్ట్‌ ప్రకటించారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను హెచ్చరించారు. పర్యాటకుల రాకపై ఆంక్షలు విధించారు. తిరునెల్వేలి, రామేశ్వరం, కొలాచల్‌ ఓడరేవుల్లో మూడో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీచేశారు. ఏడు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. కన్యాకుమారి నుంచి నాగర్‌కోవిల్‌ తదితర ప్రాంతాల్లో రైళ్లు, బస్సులను రద్దుచేశారు. శ్రీలంక నుంచి 170, 180 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని, కన్యాకుమారిలో 210 కి.మీ.వరకు వేగం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాజధాని నగరం చెన్నైలో బుధవారం రాత్రి ప్రారంభమైన వాన గురువారం రాత్రి వరకు కొనసాగింది. దీంతో పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచి ట్రాఫిక్‌ స్తంభించింది.

Related posts

Leave a Comment