ఆ ప్రశ్న అంతర్మథనంలో పడేసింది: పవన్‌

తెలుగు రాష్ట్రాల్లో యువత నిస్పృహలో ఉందని జనసేన అధినేత, సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. వారిని జాగృతం చేసేందుకు `చ‌లో రే చ‌లో రే చ‌ల్‌` గీతాన్ని విడుదల చేస్తున్నట్టు చెప్పారు. రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో మూడు విడతలుగా పర్యటించాలని ఆయన నిర్ణయించారు. తొలి విడత పర్యటనలో సమస్యల పరిశీలన, అధ్యయనం, వాటిని అవగాహన చేసుకోనున్నారు. రెండో విడత పర్యటనలో సమస్యల పరిష్కారంపై ప్రభుత్వంతో చర్చలు జరపనున్నారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో మూడో విడత పర్యటన పోరాటానికి వేదిక కానుందని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
‘ఇటీవల ఇంగ్లాండ్‌ పర్యటనలో విద్యార్థులతో జరిగిన సమావేశంలో ఓ ప్రశ్న నన్ను అంతర్మథనంలో పడేసింది. ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా నదిలో జరిగిన పడవ ప్రమాదాన్ని ఆ విద్యార్థి ప్రస్తావించాడు. ‘‘ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పడవ ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. తెదేపాకు మద్దతుగా ఎన్నికల సమయంలో మీరు ప్రచారం చేసినందున మీరు కూడా బాధ్యులు కాదా?’’ అని విద్యార్థి నన్ను ప్రశ్నించాడు. ఆలోచిస్తే ఆ ప్రశ్నలో సహేతుకత ఉందనిపించింది. అందువల్ల ఆ పడవ ప్రమాదం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ప్రైవేటీకరణ కారణంగా ఆ సంస్థ ఉద్యోగి వెంకటేశ్‌ ఆత్మహత్య ఉదంతంలో నా వంతు బాధ్యత కూడా ఉందని అంగీకరిస్తున్నా. వెంకటేశ్‌ కుటుంబాన్ని పరామర్శించేందుకు రేపే వెళ్తున్నా’ అని పవన్‌ వివరించారు.

యువతే దేశ సంపద
‘ఒక దేశం సంపద ఖనిజాలు, నదులు, అరణ్యాలు కాదు. కలల ఖనిజాలతో చేసిన యువత. వారే దేశ భవిష్యత్తుకు నావికులు అని మహాకవి గుంటూరు శేషేంద్ర శర్మ అన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని యువత నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ఇది దేశానికి మంచిది కాదు. ఇటు బాసర ఐఐఐటీ, ఉస్మానియా విద్యార్థులు, అటు విజయవాడలోని ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. వారి సమస్యలను పరిష్కరించడానికి జనసేన తన వంతు ప్రయత్నం చేస్తుందని హామీ ఇస్తున్నా. యువతను జాగృత పరిచేందుకు `చ‌లో రే చ‌లో రే చ‌ల్‌` గీతాన్ని విడుదల చేస్తున్నా. బలిదానాలు బాధాకరం.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు మురళి, కృష్ణా నదిలో జరిగిన పడవ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం నా విధిగా భావిస్తున్నా. అయితే, ఓయూ విద్యార్థి మురళీ కుటుంబాన్ని ప్రత్యక్షంగా కలిసి పరామర్శించేందుకు పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. అందువల్ల ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. మురళి సోదరుడు రాజుతో మాట్లాడినప్పుడు అతని దుఖం నన్ను కలచివేసింది. పోలీసులు ఆంక్షలు సడలించాక స్వయంగా అక్కడికి వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించాలని నిర్ణయించుకున్నా.

లేనిపోని ఆశలు రేకెత్తించడం వల్లే..
యువతలో రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఆశలు రేకెత్తించి వాటిని అమలు చేయకపోతే వచ్చే దుష్పరిణామాలకు వెంకటేశ్‌, మురళీ ఆత్మహత్యలే నిదర్శనం. యువతలో నిర్వేదం, నిరాశ చోటుచేసుకోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ఇచ్చిన హామీలు అమలు చేయడం ప్రభుత్వాల విధి. ప్రభుత్వాలు తమ బాధ్యత నుంచి తప్పించుకోకూడదు. యువత నిరాశకు గురికావొద్దని నా విజ్ఞప్తి. విలువైన ప్రాణాలు తీసుకొని తల్లిదండ్రులకు శోకం మిగల్చొద్దు. పోరాడండి. సాధించండి. నాతో పాటు జనసేన కూడా అండగా ఉంటుంది’ అన్నారు.

అంబేడ్కర్‌ వూహించి ఉంటే..
అంబేడ్కర్‌ ఆశలు, ఆశయాలకు అనుగుణంగా తమ పార్టీ పయనం కొనసాగుతుందని పవన్‌కల్యాణ్‌ స్పష్టం చేశారు. ఆశలకు, వాస్తవాలకు పొంతన లేక కూనారిల్లుతున్న యువత పరిస్థితి ఇలా ఉంటుందని అంబేడ్కర్‌ అప్పట్లో వూహించి ఉంటే రాజ్యాంగంలో ఒక అధ్యాయాన్ని యువత భవిష్యత్తు కోసం రాసి ఉండేవారేమో అని పవన్‌ అభిప్రాయపడ్డారు.

 

Related posts

Leave a Comment