కేంద్రం భరోసా

15 రోజులకోసారి పోలవరానికి వస్తానన్న గడ్కరీ
పని ఆపొద్దని ప్రస్తుత గుత్తేదారులకు ఆదేశం
కొత్త టెండర్లపై సీఎంతో మాట్లాడి నిర్ణయం
గుత్తేదారుకు ఆర్థిక వెసులుబాటుపై త్రిసభ్య కమిటీ తక్షణ నివేదిక
22న కేంద్ర మంత్రి రాక
పోలవరం ప్రాజెక్టు ద్వారా 2018 కల్లా నీళ్లు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రం ఇక పూర్తి స్థాయిలో దృష్టి సారించనుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి తాను వచ్చి స్వయంగా పనుల ప్రగతిని పరిశీలిస్తానని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. దేశమంతటా 7.2 లక్షల కోట్ల పనులు చేయిస్తున్న తనకు దీనిని నిర్దేశించిన సమయంలోగా ఎలా పూర్తి చేయించాలో తెలుసునన్నారు. పనుల వేగం ఎందుకు మందగించిందంటూ ప్రధాన గుత్తేదారును, ఉపగుత్తేదారును నిలదీశారు. వెంటనే పనుల వేగం పెంచాలని, డిసెంబర్‌ 22న తాను వస్తానని వెల్లడించారు. వేగం పెరగకపోతే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో కూడా తెలుసన్నారు. కొత్తగా టెండర్లు పిలిచినందున పనులు చేయాలో లేదో అర్థం కాక నిలిపివేసినట్లు ఉపగుత్తేదారు త్రివేణి సంస్థ పేర్కొనగా… ‘‘ వెళ్లి పనులు చేపట్టండి… బిల్లులు చెల్లించే బాధ్యత నాదని…’’ కేంద్ర మంత్రి భరోసా ఇచ్చారు. ‘రాష్ట్ర ప్రభుత్వం 60 సి కింద కొంత పని తొలగించి వేరే వారికి ఇస్తామంటోంది. ఈ విషయంలో నాకు వేరే అభిప్రాయం ఉంది.

ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే ఈ విషయం మాట్లాడతా…’ అని గడ్కరీ స్పష్టం చేశారు. గుత్తేదారు ఆర్థిక సమస్యలు, పోలవరంలో ఇతర సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ మూడు రోజుల్లో కూర్చుని నివేదిక పంపాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పిలిచిన టెండర్‌ ప్రక్రియపై ముందుకెళ్లవద్దంటూ కేంద్ర జలవనరుల శాఖ మాజీ కార్యదర్శి అమర్‌జిత్‌సింగ్‌ రాసిన లేఖ వివాదాస్పదమైన నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి గడ్కరీ మంగళవారం ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. దిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో సుమారు మూడు గంటల పాటు జరిగిన సమావేశంలో రాష్ట్ర జలవనరుల మంత్రి దేవినేని ఉమ, కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌, ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు, కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శి యూపీ సింగ్‌, కమిషనర్‌ ఓరా, ఇతర ఉన్నతాధికారులు, గుత్తేదారులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముందు దక్షిణకొరియా నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రి గడ్కరీతో సుమారు 15 నిమిషాల పాటు ఫోన్‌లో మాట్లాడారు. ప్రస్తుతం పనులు జరుగుతున్న తీరు, సమస్యాత్మకంగా మారిన అంశాలు, వేగం మందగించిన పనులను కొత్త గుత్తేదారుడికి అప్పగించాలనుకోవడానికి దారి తీసిన కారణాలను వివరించారు. వాటన్నింటిపైనా కొరియా నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూలంకషంగా మాట్లాడుకొని పరిష్కరించుకుందామని గడ్కరీ ఆయనకు చెప్పారు. రూ.318 కోట్ల బిల్లులకు నిధులు విడుదల చేయగా… ఏఐబీపీ కింద చేపట్టిన ఏడు ప్రాజెక్టులకు మరో రూ.300 కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబుతో సంభాషణ ముగిసిన అనంతరం గడ్కరీ ఉన్నతస్థాయి భేటీకి హాజరయ్యారు. తొలుత ఏపీ జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌ ఈ పనులు జరుగుతున్న వివరాలను వెల్లడించారు.

Related posts

Leave a Comment