అఖిల్‌లో నాన్న కనిపిస్తున్నారు!

‘‘తెలుగు సినిమా పరిశ్రమకి డ్యాన్సు, గ్రేసు నేర్పింది అక్కినేని నాగేశ్వరరావు. అచ్చు గుద్దినట్టుగా అఖిల్‌లో ఆయన కనబడుతున్నారు నాకు. మనసులో తనని ఎలా చూపించాలనుకొన్నానో, అందరూ ఎలా చూడాలనుకొన్నారో అలాగే ‘హలో’ చిత్రంలో కనిపిస్తాడ’’న్నారు అక్కినేని నాగార్జున. ఆయన నిర్మాణంలో తనయుడు అఖిల్‌ అక్కినేని కథానాయకుడిగా నటించిన ‘హలో!’ పాటల విడుదల కార్యక్రమం ఆదివారం రాత్రి విశాఖపట్నంలో జరిగింది. ఈ చిత్రంలో అఖిల్‌ సరసన కల్యాణి నటించింది. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకుడు. అనూప్‌ రూబెన్స్‌ స్వరకర్త. ఆయన సంగీతం అందించిన 50వ చిత్రమిది. వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తొలి సీడీని ఆవిష్కరించారు. నాగార్జున మాట్లాడుతూ ‘‘నాగచైతన్యతో ‘రారండోయ్‌ వేడక చూద్దాం’ తీసి వస్తున్నాం, కొడుతున్నాం అని చెప్పి విజయాన్ని అందుకొన్నాం. దాని తర్వాత నుంచి అఖిల్‌ సినిమా పనిమీదే ఉన్నా. అఖిల్‌ని ఈ సినిమాతో పునః పరిచయం చేస్తున్నాన్నేను. అఖిల్‌ని పెద్ద హీరోని చేయాలని బృందమంతా కలిసి ప్రేమతో ఈ సినిమా చేశారు. హలో గురు ప్రేమకోసమే జీవితం… అంటూ నన్ను, అమలని ప్రియదర్శన్‌ కలిపారు. విధి అంటారో, ఏమంటారో తెలియదు కానీ… వాళ్లమ్మాయి కల్యాణి వచ్చి ఇప్పుడు అఖిల్‌తో సినిమా చేసింది. కల్యాణి బాగా నటించింది. తనకి మంచి భవిష్యత్తు ఉంది. రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖకి రమ్మంటున్నారు. మేం ఎప్పుడో వచ్చాం. ఇక్కడ చాలా చిత్రాలు చేశాం. రాజమండ్రి, కాకినాడల్లోనూ చాలా సినిమాలు చేశాం. ఇంత ప్రేమగా పిలిచినప్పుడు కచ్చితంగా వచ్చి చేస్తాం. ఈ నెల 22వ తేదీన ‘హలో’తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాం. మూడు రోజుల కిందటే ఈ సినిమా చూశాం. వస్తున్నాం, బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొడుతున్నాం. ఇది ఫిక్స్‌. ‘హలో’ తర్వాత మళ్లీ విక్రమ్‌ కె.కుమార్‌, నాగచైతన్యతో సినిమా చేస్తున్నామ’’న్నారు. అఖిల్‌ మాట్లాడుతూ ‘‘యేడాది కాలంగా ‘హలో’ కోసం భావోద్వేగమైన ప్రయాణం చేశా. అమ్మానాన్నలు గర్వపడేలా ‘హలో’ చేశా. విక్రమ్‌ కె.కుమార్‌ని తొలిసారి కలిసినప్పుడు నిరుత్సాహంగా ఉన్నా. కానీ ‘హలో’ కథ చెప్పాక, ఆయనతో సినిమా చేశాక మళ్లీ నాకు నేను కనిపించా. రెండేళ్లు నా సినిమా లేకపోయినా నన్ను అన్ని రకాలుగా ప్రోత్సహించారు. నేను హిట్టు కొట్టడానికి రెడీ’’ అన్నారు. ప్రియదర్శన్‌ మాట్లాడుతూ ‘‘నలభయ్యేళ్ల కాలంలో 92 సినిమాలు చేశాను. కానీ నా సినీ జీవితంలో ఉత్తమమైన క్షణమిది. నేను చాలా అదృష్టవంతుడిని. రెండు తెలుగు సినిమాలు చేశా. అఖిల్‌ తాత ఏఎన్నార్‌తోనూ, తండ్రి నాగార్జున, తల్లి అమలతోనూ కలిసి పనిచేశా. ఇప్పుడు అఖిల్‌ నా నాకూతురితో నటించాడు.

నా శిష్యుల్లో ఇష్టమైన వ్యక్తి విక్రమ్‌ కె.కుమార్‌. నాకంటే పెద్ద దర్శకుడిగా పేరు తెచ్చుకొన్నాడు. నాకు ఈ సినిమాతో ఉత్తమ గురు దక్షిణ ఇచ్చాడు’’ అన్నారు. అనూప్‌రూబెన్స్‌ మాట్లాడుతూ ‘‘నాకు ఇష్టమైన దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌. సంగీతం కోసం మేం ప్రత్యేకంగా కూర్చోం. సహజంగా వస్తుంటుందంతే. ఇదివరకు ‘ఇష్క్‌’, ‘మనం’, ఇప్పుడు ‘హలో’కీ అలాగే కుదిరింది సంగీతం. అందరికీ ఈ పాటలు నచ్చుతాయని అనుకొంటున్నా’’అన్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘‘విశాఖపట్నం ఓ స్మార్ట్‌ సిటీ. ఇక్కడ స్మార్ట్‌గా ‘హలో’ వేడుక జరగడం ఆనందంగా ఉంది. సినీ పరిశ్రమకి హబ్‌గా మారాల్సిన స్థలం విశాఖ. చిత్రీకరణకి తగిన ప్రదేశాలు చాలా ఉన్నాయిఇక్కడ. చాలామంది దర్శకులు, హీరోలు, నిర్మాతలు విశాఖలో చిత్రీకరణని సెంటిమెంట్‌గా భావించేవాళ్లు. ఎంతో కొంత భాగం ఇక్కడ చిత్రీకరిస్తే సినిమా విజయవంతమవుతుందనే నమ్మకం ఉంటుంది. అటువంటి విశాఖకు సినీ పరిశ్రమ తరలి రావాల్సిన అవసరం ఉంది. ఆనాడు అక్కినేని నాగేశ్వరరావుగారు మద్రాసు నుంచి హైదరాబాద్‌కి చిత్ర పరిశ్రమకి రావడానికి ఎలా కృషి చేశారో… అలా ఇప్పుడు అక్కినేని కుటుంబం చిత్ర పరిశ్రమ విశాఖకి రావడానికి కృషి చేయాలి. ఇక్కడ చిత్రీకరణలు చేసుకోవడానికి సింగిల్‌ విండో పద్ధతిలో అనుమతులిస్తున్నాం. అన్ని ఏర్పాట్లు చూసుకొనేందుకు ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తున్నాం. సినీ పరిశ్రమకి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు జరపాలన్నా విశాఖని ఎంచుకోవాలని కోరుకొంటున్నా. ‘హలో’ పాటలు, ట్రైలర్లు చూశాక సినిమా కచ్చితంగా విజయవంతమవుతుందనే నమ్మకం కలిగింది. అఖిల్‌ నటన చూశాక, మాస్‌ ఇమేజ్‌ ఉన్న హీరో కూడా అవుతాడనే నమ్మకం కలిగింది’’ అన్నారు.

చంద్రబోస్‌ మాట్లాడుతూ ‘‘రెండు మంచి పాటలు రాశాను. విక్రమ్‌ కె.కుమార్‌ ఆత్మని స్పృశించే సందర్భం సృష్టిస్తే… అనూప్‌రూబెన్స్‌ హృదయాన్ని హత్తుకొనే సంగీతం అందించారు’’ అన్నారు. కల్యాణి మాట్లాడుతూ ‘‘తెలుగు భాష అంటే నాకు ఇష్టం. అమ్మానాన్నలు లేకపోతే ఇంత ఆత్మవిశ్వాసంతో నేను పరిశ్రమకి పరిచయమయ్యేదాన్ని కాదు. నాగార్జున ఇచ్చిన సలహాలు, నిర్మాణంలో ఆయన ప్రమాణాలు మరొకరి నుంచి వూహించలేను. అనూప్‌ రూబెన్స్‌ పాటలు నచ్చాయి’’ అన్నారు. ‘‘అఖిల్‌ని ఓ ప్రేమకథలో చూడాలని ఉండేది. అది ‘హలో’తో తీరబోతోంది. మా కుటుంబం నుంచి డిసెంబరులో వచ్చిన సినిమాలు బాగా ఆడాయి. ఈ చిత్రం ఇదే నెలలోనే వస్తోంది. అభిమానులకి ఓ కానుకగా ఈ సినిమాని అందించాలనే తపనతో పనిచేశాడు అఖిల్‌. అక్కినేని అభిమానులకి డిసెంబరు 22 ప్రత్యేకమైన రోజు అవుతుంద’’ని వీడియో సందేశంలో చెప్పారు నాగచైతన్య, సమంత. వేదికపై చిత్ర నాయకానాయికలు ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో అమల అక్కినేని, అలీ, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, శ్రీనిధి, మహేష్‌రెడ్డి, శ్రేష్ఠ తదితరులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment