శాసనసభ ఆకృతిపై తుది నిర్ణయం 13న

సీఎంతో రాజమౌళి సమావేశం

అమరావతి పరిపాలన నగరంలో నిర్మించే శాసనసభ భవనం తుది ఆకృతిని ఈ నెల 13న ఖరారు చేయనున్నారు. లండన్‌కు చెందిన నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ సిద్ధం చేసిన ఆకృతులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో సమీక్షించారు. పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, సీఆర్‌డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌, కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌, సినీ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఈ సమావేశంలో పాల్గొన్నారు. నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ రూపొందించిన ఆకృతుల విశేషాలను రాజమౌళి సమావేశంలో ముఖ్యమంత్రికి వివరించారు. నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ప్రతినిధులు మంగళవారం అమరావతికి వస్తున్నారు. 12, 13 తేదీల్లో ముఖ్యమంత్రితో సమావేశమవుతారు. ఆ సందర్భంగా శాసనసభ భవనం తుది ఆకృతిని ఖరారుచేసే అవకాశం ఉంది. అక్టోబరు చివరి వారంలో ముఖ్యమంత్రి లండన్‌ వెళ్లి నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ రూపొందించిన హైకోర్టు, శాసనసభ ఆకృతులను పరిశీలించారు. ఆ బృందంలో రాజమౌళి కూడా ఉన్నారు. హైకోర్టుకు బౌద్ధ స్ధూపాన్ని పోలినట్టు రూపొందించిన ఆకృతిని ముఖ్యమంత్రి ఖరారు చేశారు. దాని ముఖద్వారంలోను, భవనం లోపలి భాగాల్లోనూ కొన్ని మార్పులు సూచించారు.

 

ఆ విధంగా మార్పులు చేసిన ఆకృతుల్ని నార్మన్‌ ఫోస్టర్‌ బృందం తీసుకురానుంది. ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో మరోసారి సమావేశమై తాము చేసిన మార్పులను ఆయనకు వివరించి ఆయన అనుమతి తీసుకుంటారు. శాసనసభకు సంబంధించి ముఖ్యమంత్రి లండన్‌ వెళ్లినప్పుడు రెండు ఆకృతుల్ని ఎంపిక చేశారు. చతురస్రాకారంలో ఉన్న ఆకృతితో పాటు భవనంపై పొడవైన స్తంభం (టవర్‌)తో ఉన్న ఆకృతిని ఎంపిక చేశారు. ఆ రెండు ఆకృతులను మరింత మెరుగుపరిచి తీసుకురావాలని, వాటిలో ఉత్తమైనదాన్ని ఎంపిక చేద్దామని చెప్పారు. ఆకృతులు తెలుగుదనం ఉట్టిపడేలా, ఆంధ్రుల సంస్కృతికి అద్దం పట్టేలా ఉండాలని సూచించారు. నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ప్రతినిధులతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ తగిన సూచనలిచ్చే బాధ్యతను రాజమౌళికి అప్పగించారు.

Related posts

Leave a Comment