ప్రేమాంతకురాలు

కోరి పెళ్లాడిన వ్యక్తినే చంపేసింది
వివాహేతర సంబంధానికి అడ్డొస్తాడని..
ప్రియుడితో కలిసి ఘాతుకం
అతణ్ని భర్తగా చూపించేందుకు యాసిడ్‌ దాడి నాటకం
కటకటాలపాలైన స్వాతి
వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకుని ఏడేళ్లుగా కలిసి బతుకుతున్నారు. వారి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఆరేళ్ల కుమారుడు, నాలుగేళ్ల పాప ఉన్నారు. అయితే భర్త వ్యాపార పనుల్లో పడి తనను పట్టించుకోవడం లేదన్న చిన్న అసంతృప్తితో ఆమె చక్కటి సంసారంలో నిప్పులు పోసుకుంది. అడ్డదారి తొక్కి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుంది. అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో కలిసి హతమార్చింది. అక్కడితో ఆగకుండా ప్రియుడినే తన భర్తగా అందర్నీ నమ్మించేందుకు ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయింది. సినిమా కథను తలపించేలా సాగిన ఆమె కుట్రను పోలీసులు చేధించడంతో ఇప్పుడు కటకటాలు లెక్కపెడుతోంది. నాగర్‌కర్నూల్‌ జిల్లా అదనపు ఎస్పీ జోగుల చెన్నయ్య తెలిపిన వివరాల ప్రకారం.. తెలకపల్లి మండలం బండపల్లికి చెందిన సుధాకర్‌రెడ్డి, తెలకపల్లికి చెందిన స్వాతి ఏడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లు హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేసిన సుధాకర్‌రెడ్డి మూడేళ్ల క్రితం నాగర్‌కర్నూల్‌కు తిరిగివచ్చి క్రషర్‌ వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారంలో తలమునకలైన అతను ఉదయం వెళ్లి రాత్రి తిరిగివచ్చేవాడు. భర్త తనను పట్టించుకోవడం లేదనే భావనతో ఉన్న స్వాతికి.. నాగర్‌కర్నూల్‌లోనే ఫిజియోథెరపీ కేంద్రం నిర్వహిస్తున్న రాజేశ్‌తో రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. సుధాకర్‌రెడ్డి లేని సమయంలో రాజేశ్‌ తరచూ స్వాతి ఇంటికి వచ్చి కలుస్తుండేవాడు.

భర్త అడ్డు తొలగించుకోవాలని స్వాతి రాజేశ్‌తో కలిసి పథకం రచించింది. ఇదిలా ఉండగా గత నెల 26న కిందపడి గాయాలపాలైన సుధాకర్‌రెడ్డి మంచానికే పరిమితమయ్యాడు. భర్తను చంపడానికి ఇదే అనువైన సమయమని స్వాతి రాజేశ్‌కు చెప్పింది. గత నెల 27 తెల్లవారుజామున సుధాకర్‌రెడ్డి నిద్రపోతుండగా రాజేశ్‌ అతనికి మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చాడు. స్వాతి భర్త నోరును నొక్కిపట్టగా రాజేశ్‌ ఇనుపరాడ్‌తో తలపై గట్టిగా కొట్టడంతో సుధాకర్‌రెడ్డి చనిపోయాడు. నిందితులిద్దరూ కలిసి మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి సుధాకర్‌రెడ్డి కారు డిక్కీలో వేసుకుని మహబూబ్‌నగర్‌కు సమీపంలోని ఫతేపూర్‌ మైసమ్మ ఆలయ సమీంపలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి పెట్రోల్‌ పోసి కాల్చేశారు. కారును మహబూబ్‌నగర్‌లోని మారుతి షోరూమ్‌లో మరమ్మతు కోసం ఇచ్చి అద్దెకారులో నాగర్‌కర్నూల్‌కు తిరిగివచ్చారు.

 

ప్రియుడే భర్త అని నమ్మించే యత్నం

పథకం ప్రకారం ముఖానికి ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకొని సుధాకర్‌రెడ్డిగా అవతారమెత్తడానికి రాజేష్‌ తన ముఖంపై పెట్రోల్‌ పోసుకొని కాల్చుకున్నాడు. తన భర్తపై గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్‌ దాడి చేశారంటూ స్వాతి తన బావ సురేందర్‌రెడ్డి (సుధాకర్‌రెడ్డి సోదరుడు)కి ఫోన్‌ చేసి చెప్పింది. చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఎస్పీ కల్మేశ్వర్‌ సింగెనవార్‌ నాగర్‌కర్నూల్‌లోని హనుమాన్‌నగర్‌లో వారు నివాసముంటున్న ఇంటికి వెళ్లి సుధాకర్‌రెడ్డిపై దాడిచేసింది ఎవరనే కోణంలో విచారణ ప్రారంభించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది భర్త సుధాకర్‌రెడ్డేనని స్వాతి అందరినీ నమ్మించింది. పోలీసులూ నమ్మి ఆసుపత్రికి వెళ్లి వివరాలు సేకరించారు.
అలా బయటపడింది..
సుధాకర్‌రెడ్డిని పరామర్శించడానికి ఈ నెల 9న అతని అన్న సురేందర్‌రెడ్డి, తల్లి సుమతమ్మ ఆసుపత్రికి వెళ్లారు. చికిత్స పొందుతున్నది సుధాకర్‌రెడ్డి కాదని గుర్తించి నాగర్‌కర్నూల్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. కొల్లాపూర్‌ సీఐ శ్రీనివాస్‌రావు బృందం హైదరాబాద్‌ వెళ్లి చికిత్స పొందుతున్న వ్యక్తి వేలిముద్రలను సేకరించారు. అతను సుధాకర్‌రెడ్డి కాదని, రాజేశ్‌ అని నిర్ధారణకు వచ్చారు. వెంటనే స్వాతిని అదుపులోకి తీసుకొని విచారించారు. రాజేశ్‌తో కలిసి భర్తను హతమార్చి మృతదేహాన్ని కాల్చివేసినట్లు అంగీకరించింది. శనివారం పోలీసులు అక్కడికి వెళ్లి ఆధారాలు సేకరించారు. సుధాకర్‌రెడ్డి హత్య కేసులో రాజేశ్‌, స్వాతి నిందితులుగా చేర్చి కేసు నమోదు చేశారు. స్వాతినిఆదివారం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. రాజేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తామన్నారు.

 

Related posts

Leave a Comment