క్షణం.. క్షణం.. ఉత్కంఠభరితం

అల్లు శిరీష్‌, సురభి, అవసరాల శ్రీనివాస్‌, సీరత్‌కపూర్‌ నటించిన చిత్రం ‘ఒక్క క్షణం’. వి.ఐ. ఆనంద్‌ దర్శకుడు. చక్రి చిగురుపాటి నిర్మాత. మణిశర్మ సంగీతం సమకూర్చారు. హైదరాబాద్‌లో ముందస్తు విడుదల వేడుక జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ కథానాయకుడు అల్లు అర్జున్‌ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. అనంతరం అర్జున్‌ మాట్లాడుతూ ‘‘టైగర్‌ చూశాక ఆనంద్‌తో సినిమా చేయి, ఆయన పెద్ద డైరెక్టర్‌ అవుతాడ’ని శిరీష్‌కి చెప్పా. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడంలో నాకూ కొంచెం క్రెడిట్‌ దక్కుతుంది. ‘ఒక్క క్షణం’ చూశా. మాస్‌ సినిమాలకంటే అర్థవంతమైన కథల్ని ఎంచుకోవడానికి శిరీష్‌ ఇష్టపడతాడు. ఈ చిత్రం కూడా అలాంటిదే. అవసరాల శ్రీనివాస్‌ నటన సినిమాకి తోడ్పడింది. నేను నటిస్తోన్న ‘నా పేరు సూర్య-నా ఇల్లు ఇండియా’ సినిమా టైటిల్‌ ఎప్పటికైనా నేను గర్వపడేదే. జనవరి 1న ఫస్ట్‌ ఇంపాక్ట్‌ విడుదలవుతుంది’’ అన్నారు. అల్లు శిరీష్‌ మాట్లాడుతూ ‘‘సమాంతర జీవితాలపై నడిచే కథ. వినోదం అంతర్లీనంగా ఉంటుంది. ఈనెల 28న విడుదల అవుతుంద’’న్నారు. అవసరాల శ్రీనివాస్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలోని పాత్రతో ఇప్పటివరకూ పొందనంత సంతృప్తిని దక్కించుకున్నా’’ అన్నారు. అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ‘‘కొత్తవిషయాలను ఆహ్వానించే ప్రేక్షకులకి నచ్చే సినిమా. శిరీష్‌ ఈ సినిమాతో ఓ స్థాయికి చేరతాడ’’న్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘శిరీష్‌ అన్ని రంగాల్లోనూ రాణించాడు’’ అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ శాసన సభ స్పీకర్‌ మధుసూదనాచారి, నాగబాబు, సురభి, సీరత్‌కపూర్‌, ప్రవీణ్‌, సత్య, శంకర్‌ చిగురుపాటి, కల్యాణ్‌ చిగురుపాటి, శ్యామ్‌ కె. నాయుడు, కాశీవిశ్వనాధ్‌ తదితరులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment