ఆ బూట్లలో ఏదో ఉంది.. అందుకే తీసుకున్నాం

కుల్‌భూషణ్‌ వ్యవహారంపై పాక్‌
కుల్‌భూషణ్‌ జాదవ్‌ వ్యవహారంలో భారత్‌-పాక్‌ మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సోమవారం ఇస్లామాబాద్‌లోని పాక్‌ విదేశాంగ కార్యాలయంలో జాదవ్‌ను అతడి భార్య, తల్లి కలిసిన విషయం తెలిసిందే. అయితే మానవతా దృక్పథంతో ఈ భేటీని ఏర్పాటుచేశామని చెప్పిన పాక్‌.. జాదవ్‌ కుటుంబసభ్యులతో మాత్రం అనుచితంగా ప్రవర్తించింది. సమావేశానికి ముందు జాదవ్‌ భార్య, తల్లి మంగళసూత్రాలు, గాజులు, బొట్టును తీసివేయించింది. అంతేకాదు.. జాదవ్‌ భార్య పాదరక్షలను తీసుకుని మళ్లీ తిరిగి ఇవ్వలేదు. దీంతో పాక్‌ తీరుపై భారత్‌ తీవ్రంగా మండిపడింది. అయితే పాక్‌ మాత్రం తాము ఏ పొరబాటు చేయలేదని చెప్పడం గమనార్హం. భారత్‌ చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవి అని చెబుతున్న పాక్‌.. జాదవ్‌ భార్య పాదరక్షలు తీసుకున్న మాట వాస్తవమేనని పేర్కొంది. ఆ బూట్లలో ఏదో ఉందని.. అందుకే వాటిని తీసుకున్నట్లు తెలిపింది.
భద్రతా కారణాల దృష్ట్యా ఆమె పాదరక్షలను తీసుకున్నట్లు పాక్‌ విదేశాంగశాఖ ప్రతినిధి మహ్మద్‌ ఫైజల్‌ తెలిపారు. ఆ బూట్లలో ఏదో ఉందని.. వాటిపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వాటికి బదులుగా జాదవ్‌ భార్యకు మరో పాదరక్షల జత ఇచ్చామని.. అంతేగాక.. వారి ఆభరణాలను కూడా తిరిగిచ్చేశామని చెప్పారు. ఈ విషయంలో భారత్‌ చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని.. భేటీ అనంతరం జాదవ్‌ తల్లి పాక్‌కు కృతజ్ఞతలు కూడా చెప్పారన్నారు. ఈ విషయంలో ఇంతకంటే చెప్పేదేమీ లేదన్నారు.

Related posts

Leave a Comment