వివాహేతర సంబంధానికి అడ్డొచ్చాడని.. స్నేహితుడి హత్య

నలుగురికి రిమాండ్‌..
కారు, కత్తి, స్వాధీనం
శంషాబాద్‌వద్ద ‘కారు హత్య’ కేసును ఛేదించిన పోలీసులు
యువకుడి గొంతుకోసి.. పెట్రోల్‌తో కాల్చేసిన కేసును పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడితోపాటు మరో ముగ్గురిని అరెస్టు చేసి.. కారు, ద్విచక్రవాహనం, ఓ కత్తి, నాలుగు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళతో తన స్నేహితుడు చనువుగా ఉండటంతో కక్షగట్టి నిందితుడు అతడిని హత్య చేసినట్లు తేలింది. మంగళవారం ఆర్జీఐఏ ఠాణాలో శంషాబాద్‌ జోన్‌ డీసీపీ పద్మజారెడ్డి, ఏసీపీ అశోక్‌కుమార్‌, సీఐ కృష్ణప్రసాద్‌ వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌, జుమ్మెరాత్‌బజార్‌కు చెందిన జెర్రిగల్ల రమేశ్‌(24) ఫంక్షన్‌హాళ్లలో వేదికలను అలంకరించడం, ఎలక్ట్రీషియన్‌ పనులు చేస్తుంటాడు. అదే బస్తీకి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అతని స్నేహితుడు మహేశ్‌(25) సదరు మహిళతో చనువుగా ఉంటున్నాడు. ఆగ్రహించిన రమేశ్‌ పలుమార్లు మహేశ్‌ను హెచ్చరించి గొడవపడ్డాడు. ఈ విషయం ఆ మహిళ భర్తకు తెలియడంతో వారు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. దీనంతటికీ కారణమైన మహేశ్‌ను మట్టుబెట్టాలని రమేశ్‌ పథకం పన్నాడు. వారం క్రితం కత్తిని కొన్నాడు. పథకం ప్రకారం అదే బస్తీకి చెందిన క్యాబ్‌డ్రైవర్‌ నరేశ్‌(27) కారును అద్దెకు తీసుకురాగా.. జియాగూడకు చెందిన రమేశ్‌ బావమరిది శివ(26)తో సహా అందరూ ఈ నెల 24న కడ్తాల్‌ మండలం, మైసిగండికి వెళ్లారు. అక్కడ అంతా కలిసి మద్యం తాగి తిరుగుప్రయాణమయ్యారు. ముందు సీట్లో మహేశ్‌.. వెనుక రమేశ్‌ కూర్చున్నారు. శంషాబాద్‌ పరిధిలోని తుక్కుగూడ వద్దకు రాగానే రమేశ్‌ కత్తితో మహేశ్‌ గొంతు కోసి చంపేశాడు. మృతదేహాన్ని మదనపల్లి సమీపంలో పడేసి.. పెట్రోల్‌ పోసి కాల్చేశారు. హత్య విషయం శివ బంధువైన యాదయ్య(60)కు చెప్పారు. మరుసటి రోజు (25న) ఉదయం రమేశ్‌ కారు తీసుకొని శంషాబాద్‌లోని సర్వీసింగ్‌ సెంటర్‌కు వెళ్లాడు. అక్కడి సిబ్బంది కారులో రక్తపు మరకలను చూసి ఆర్జీఐఏ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితులు దొరికిపోయారు. రమేశ్‌, అతడికి సహకరించిన శివ, నరేశ్‌, యాదయ్యలపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Related posts

Leave a Comment