తెలుగునేలపై సాంకేతిక సుఫలాలు

నేటినుంచి ఇంటింటికీ ‘ఫైబర్‌ నెట్‌’
‘ఏదో ఒక నెపంతో రేపటి బాధ్యతల నుంచి మనం ఈ రోజు తప్పించుకోలేం’ అంటారు అబ్రహాం లింకన్‌. ప్రభుత్వాలు, పాలకులు, వ్యక్తులు ఎవరికైనా సరే… ఇది అనుసరణీయమైన హితోక్తి. సాంకేతిక విప్లవం దేశాల సరిహద్దులు చెరిపేసింది. ప్రపంచమొక కుగ్రామంగా మారిపోయి మనమంతా ఎల్లలు లేకుండా మమేకమవుతున్నాం. అంతర్జాల ఆవిష్కర్తలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకోక తప్పదు. సాంకేతికత ప్రతిరోజూ కొత్తపుంతలు తొక్కుతోంది. సుపరిపాలన కోసం దాన్నో ప్రభావవంతమైన సాధనంగా ప్రభుత్వాలు వినియోగిస్తున్నాయి. మూడు వసంతాల నవజాత నవ్యాంధ్రప్రదేశ్‌ సుపరిపాలన ఆవిష్కారంలో మొదటినుంచీ ముందే ఉంటోంది. ఆ క్రమంలో ఎప్పటికప్పుడు సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలు అందిపుచ్చుకొంటోంది. సాంకేతిక క్రతువులో మరో కీలక ఘట్టం దిశగా నవ్యాంధ్ర ఉరకలేస్తోంది. దేశంలో మరే ఇతర రాష్ట్రానికీ సాధ్యంకాని ఫైబర్‌గ్రిడ్‌ ప్రాజెక్టును సాకారంచేసి- ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దేశ ప్రజలందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. ‘ఫైబర్‌ నెట్‌’ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా చంద్రబాబు సర్కారు ఇవాళ జాతికి అంకితం చేస్తోంది. ఒకేసారి 1.10 లక్షల ఆవాసాలను ఫైబర్‌ నెట్‌తో అనుసంధానించడంతోపాటు- ఇళ్లవద్ద ఉన్న ప్రజలను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నేరుగా పలకరించి పులకింపజేయనున్నారు. ఆ మధుర క్షణాలకోసం రాష్ట్ర ప్రజానీకం ఎంతో అతృతతో ఎదురు చూస్తోంది. ఈ ఫైబర్‌ నెట్‌ ద్వారా కేవలం రూ.149లకు అంతర్జాలం, 250కి పైగా టెలివిజన్‌ ఛానెళ్లు, ల్యాండ్‌లైను టెలిఫోన్‌ సదుపాయం కల్పించనున్నారు. ఇది సామాన్యమైన విషయం కాదు. ప్రపంచంలో మరెక్కడా ఇంత తక్కువ ధరకు ఇన్ని సేవలు అందించే బ్రాడ్‌బ్యాండ్‌ వ్యవస్థ ఉంటుందనుకోవడం లేదు. ఏపీ ఫైబర్‌ నెట్‌ తరవాతి దశ వినియోగదారులకు 500 టెలివిజన్‌ ఛానెళ్లు అందించడం!

Related posts

Leave a Comment