దుమ్ములో కలుస్తున్న ప్రాణాలు

మొయినాబాద్‌లో ప్రమాదకరంగా జాతీయ రహదారి
గుంతల్లో పడి ఆరు నెలల్లో ఎనిమిది మంది మృతి
హైదరాబాద్‌-బీజాపూర్‌ జాతీయ మార్గంలోని అజీజ్‌నగర్‌, హిమాయత్‌నగర్‌, అమ్డాపూర్‌, మొయినాబాద్‌, చేవెళ్ల కూడళ్లలోని తారు రోడ్డు స్థానంలో వైట్‌ట్యాపింగ్‌ రహదారి చేపట్టేందుకు సర్కారు రూ.11కోట్ల నిధులను రెండేళ్ల క్రితం కేటాయించింది. పనులు మాత్రం నత్తను తలపిస్తున్నాయి. ఆరు నెలల వ్యవధిలో మొయినాబాద్‌ ఠాణా పరిధిలో 15 మంది మృత్యువాతపడగా.. ఇందులో అసంపూర్తి రోడ్డు నిర్మాణ పనుల కారణంగా ఎనిమిది మంది గుంతల్లో పడి మృతిచెందారు.
నగరానికి పరిమితమైన వైట్‌ట్యాపింగ్‌ రోడ్లను శివారుల్లోనూ నిర్మించాలని తెలంగాణ సర్కారు సంకల్పించింది. ఇందులో భాగంగా మొయినాబాద్‌, చేవెళ్లలోని ప్రధాన కూడళల్లో పనులు చేపట్టేందుకు రూ.11కోట్ల నిధులు కేటాయించింది. ఈ నిధులతో గండిపేట సమీపంలోని అజీజ్‌నగర్‌, హిమాయత్‌నగర్‌, అమ్డాపూర్‌, మొయినాబాద్‌, చేవెళ్ల కూడళ్లలో పనులు చేపట్టాల్సి ఉండగా.. అజీజ్‌నగర్‌, హిమాయత్‌నగర్‌, అమ్డాపూర్‌ కూడళ్లలో రహదారి ఎత్తును పెంచి తిరిగి తారు వేసి చేతులు దులుపుకొన్నారు. ఇక మొయినాబాద్‌ కేంద్రంలో నగరానికి వెళ్లే దారిని మాత్రం వైట్‌ట్యాపింగ్‌గా మార్చగా.. బీజాపూర్‌ వెళ్లే మార్గంలో కంకరవేసి వదిలేశారు. రెండు రోజుల క్రితం ఇంద్రారెడ్డి కూడలిలో రహదారి మధ్యలో పోసిన కంకరకుప్పకు ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో గండిపేట మండలానికి చెందిన ఓ యువకుడు చనిపోయాడు. రెండు నెలల క్రితం ఇదే ప్రాంతంలో ముర్తుజగూడకు చెందిన మహిళ ప్రాణాలు కోల్పోయింది. అయినా అధికారుల్లో కదలిక కన్పించడం లేదు. ఆరు నెలల్లో పూర్తి చేయాల్సిన పనులు రెండేళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. హైదరాబాద్‌-బీజాపూర్‌ జాతీయ మార్గంలోని మొయినాబాద్‌, చేవెళ్లలో వైట్‌ట్యాపింగ్‌ రోడ్లు, తంగడపల్లి రహదారి విస్తరణ కోసం సర్కారు రూ.47కోట్ల నిధులను మంజూరు చేసింది. పనుల్లో కదలిక లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

 

Related posts

Leave a Comment