ఔషధమే.. వ్యాధిస్తోంది

చీటికి మాటికి మందుల వినియోగంతో అనర్థాలే
వైద్యుని చీటీ లేకుండానే కొనుగోళ్లు
ఇటీవల కాలంలో పెరిగిన ధోరణి
ఊపిరితిత్తులు, కాలేయంపై తీవ్ర ప్రభావం

కరీంనగర్‌కు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి కాళ్లు చేతులు లాగుతున్నాయనీ, నీరసంగా ఉంటోందని ఇటీవల హైదరాబాద్‌లో ఓ వైద్యుణ్ని సంప్రదించాడు. వైద్య పరీక్షల్లో అతని రెండు మూత్రపిండాలూ దెబ్బతిన్నాయని నిర్ధారణ అయింది. చెడు అలవాట్లు లేకపోయినా ఎందుకిలా జరిగింది? అనే దిశగా వైద్యుడు అతన్ని లోతుగా విచారించాడు. ‘ఐదారేళ్ల కిందట ఒళ్లు నొప్పులతో స్థానిక వైద్యుణ్ని సంప్రదించగా ‘ఐబూప్రొఫెన్‌’ ఔషధాన్ని రాసిచ్చాడని, నొప్పులున్న ప్రతి సందర్భంలోనూ వైద్యుని ప్రమేయం లేకుండా అదే ఔషధాన్నే వాడుతున్నానని’ రోగి చెప్పడంతో వైద్యుడిని విషయం బోధపడింది. నొప్పిమాత్రలను దీర్ఘకాలం వాడటం వల్ల మూత్రపిండాలకు ముప్పుంటుందని తెలుసుకోలేని రోగి.. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొంటున్నాడు.

ఆయనొక్కడే కాదు..అత్యధికులు ఇలాంటి అలవాటుతో లేనిపోని ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. సాధారణ జలుబు, దగ్గు మొదలుకుని గొంతునొప్పి, ఇతర ఇన్‌ఫెక్షన్ల కారణంగా జ్వరం, ఒళ్లు నొప్పులు, మోకాళ్ల నొప్పులు, తలనొప్పి తదితర పలు అనారోగ్యాలకూ తమ ఇష్టానుసారంగా ఔషధాలను వినియోగించే ధోరణి తీవ్ర అనారోగ్య సమస్యలకు కారణమవుతోంది. పత్రికలు, ప్రసార మాధ్యమాల వల్ల ఆరోగ్యంపై కొంతమేర అవగాహన పెరగడం..అంతర్జాలంలో అన్ని వ్యాధులకూ ఔషధాల సమాచారం లభ్యమవడం..గతంలో ఇదే జబ్బుకు వైద్యుడు రాసిచ్చిన చీటీ అందుబాటులో ఉండడం..వైద్యుని సంప్రదింపులు ఖరీదైన ప్రక్రియ కావడం వంటి కారణాలతో చాలామంది సొంతంగా మందుల్ని వినియోగించుకోవడం ఇటీవలి కాలంలో ఎక్కువైందని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఔషధ దుకాణదారులు తమను సంప్రదించే వారు చెప్పే వ్యాధి లక్షణాల అధారంగా మందులు ఇస్తుండటం కూడా దీనికి దోహదం చేస్తోందంటున్నారు. ఈ ధోరణి వల్ల చాలామంది దీర్ఘకాలంలో తీవ్ర అనారోగ్య సమస్యల బారినపడుతున్నారని పేర్కొంటున్నారు.

నిబంధనలు తోసిరాజని
సాధారణ జలుబు, దగ్గు, జ్వరం వంటి కొన్ని అనారోగ్య సమస్యలకు వైద్యుని చీటి లేకుండానే రోగులకు ఔషధాలను విక్రయించేందుకు ఔషధ దుకాణదారులకు అనుమతులున్నాయి. యాంటీబయాటిక్స్‌ వంటి ఔషధాలు మాత్రం వైద్యుని చీటి మేరకే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను ఉల్లంఘించి కొందరు అన్ని రకాల ఔషధాలను వైద్యుల చీటి లేకుండానే యథేచ్ఛగా విక్రయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

Related posts

Leave a Comment