ఆంత్రాక్స్‌ మళ్లీ విజృంభణ

విశాఖ మన్యంలో 20 రోజుల వ్యవధిలో 23 కేసులు!
జబ్బుపడిన మాంసాన్ని కోయడం, తినడం వల్లే..
అవగాహన కల్పించడంలో అధికారులు విఫలం
ఆందోళన చెందుతున్న గిరిజనం
విశాఖ మన్యాన్ని ఆంత్రాక్స్‌ వణికిస్తోంది. గత మూడేళ్లలో 37 కేసులు నమోదైతే ఈ ఏడాది నాలుగు నెలల్లో 27 కేసులు వెలుగుచూశాయి. 20రోజుల వ్యవధిలోనే 23మంది ఆంత్రాక్స్‌ లక్షణాలతో చికిత్స పొందుతుండటాన్ని బట్టి ఈ వ్యాధి విజృంభణ ఏస్థాయిలో ఉందో అంచనా వేయొచ్చు. దీంతో మన్యంలో ఆందోళన వ్యక్తమవుతోంది. వ్యాధిపట్ల గిరిజనుల్లో అవగాహన కల్పించడంలో వైద్య ఆరోగ్య, పశుసంవర్థక శాఖలు విఫలమవుతున్నాయి. వ్యాధి లక్షణాలు కనిపించినప్పుడు హడావిడి చేయడం తప్ప నివారణ, నియంత్రణకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానిక గిరిజనులు ఆరోపిస్తున్నారు. 2002లో మొదటిసారిగా అరకు, ముంచంగిపుట్టు మండలాల్లో ఈ వ్యాధి వెలుగుచూడగా.. 2015 నుంచి వ్యాప్తి ఎక్కువుగా ఉంది.

ఒకేసారి 15 మందికి..
రెండు రోజుల కిందట గూడెంకొత్తవీధి మండలం మాడేం కాలనీకి చెందిన 15 మంది ఆంత్రాక్స్‌ లక్షణాలతో కేజీహెచ్‌లో చేరారు. వీరు ఈనెల 14, 17 తేదీల్లో చనిపోయిన ఐదు ఆవులను ఖననం చేయకుండా వండుకుని తిన్నారని స్థానికులు చెబుతున్నారు. తాజాగా బుధవారం చింతపల్లి మండలం గొమ్మంగి పంచాయతి గెంజిపేటకు చెందిన నలుగురు ఆంత్రాక్స్‌ లక్షణాలతో సామాజిక ఆసుపత్రిలో చేరారు. వీరిని కూడా చింతపల్లి నుంచి మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్‌కు తరలించారు.

నేలలో సజీవంగా 40 సంవత్సరాలు..
ఆంత్రాక్స్‌ బ్యాక్టిరియా ద్వారా వ్యాపిస్తుంది. జబ్బు పడిన పశువును సక్రమంగా ఖననం చేయకుండా వదిలేయడం వల్ల బ్యాక్టీరియా ఆ నేలలో సజీవంగా 40 ఏళ్ల వరకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ఏడాదంతా నిద్రావస్థలో ఉంటూ వర్షాలు పడినప్పుడు చలనంలోకి వస్తుంది. ముఖ్యంగా ఆ బ్యాక్టిరియా ఉన్న ప్రాంతంలో గ్రాసం తినే పశువులు, గడ్డి కోసేవారికి కూడా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. పశువుల్లోని ఊపిరితిత్తులకు ఈబ్యాక్టిరియా చేరడంతో అవి కొద్ది రోజుల్లోనే చనిపోతాయి. సరైన అవగాహన లేక చనిపోయిన పశు మాంసాన్ని గిరిజనులు రోజులు తరబడి నిల్వచేసుకుని తింటుంటారు. దీనివల్లే ఆంత్రాక్స్‌ బారిన పడుతుంటారని పశు సంవర్థకశాఖ ఇన్‌ఛార్జి జేడీ రామకృష్ణ పేర్కొన్నారు.
వ్యాధి నిర్థారణకు రెండు నెలలు
జబ్బుపడిన పశువును కోసినా.. తిన్నా ఈ వ్యాధి శరీరంలోకి చేరిపోతుంది. ముందుగా పశువును కోసిన వారికే ఈవ్యాధి త్వరగా సోకుతుంది. సరిగ్గా వండకుండా తిన్నా ఆంత్రాక్స్‌ బారిన పడతారు. గత రెండు రోజుల్లో అనుమానిత లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన వారంతా పశుమాంసాన్ని కోసినవారే కావడం విశేషం. వీరికి చేతులు, కాళ్లపై పుళ్లు.. కురుపులు వచ్చి రక్తస్రావం జరుగుతుంది. ప్రాణాంతకం కాకున్నా ముందుగా మేలుకోకుంటే ఇబ్బందేనని ఇన్‌ఛార్జి డీఎంహెచ్‌వో వసుంధర తెలిపారు.

గట్టి చర్యలు తీసుకోవాలి: ముఖ్యమంత్రి
మన్యంలోని ఆంత్రాక్స్‌ ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా బుధవారం అధికారులతో సమీక్షించారు. వ్యాధి ప్రబలకుండా గట్టి చర్యలు తీసుకోవాలని పశుసంవర్థక శాఖ అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రజల్లో అవగాహన తీసుకురావాలన్నారు. మలేరియా ప్రబలకుండా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. 2 శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

Related posts

Leave a Comment