ఫాంహౌస్‌కి ప్రభుత్వ నిధులతో రోడ్డు

కొండవాగుని ఆక్రమించి మరీ రహదారి నిర్మాణం
విజయనగరం సంయుక్త కలెక్టరు-2 నాగేశ్వరరావు నిర్వాకం
తవ్వేకొద్ద్దీ బయటపడుతున్న అక్రమ వ్యవహారాలు
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అనిశా అధికారులకు చిక్కిన విజయనగరం సంయుక్త కలెక్టరు-2 కాకర్ల నాగేశ్వరరావు అక్రమ వ్యవహారాలు తవ్వేకొద్ద్దీ వెలుగులోకి వస్తున్నాయి. ఈ నెల 18న ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్లోని 10 ప్రాంతాల్లో ఏక కాలంలో చేసిన సోదాల్లో సుమారు రూ.60 కోట్ల విలువైన(పుస్తక విలువ రూ.4.34 కోట్లు) అక్రమాస్తులు కలిగి ఉన్నట్లుగా అనిశా గుర్తించిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం విజయనగరం జిల్లాలోని గంట్యాడ మండలం కొండతామరాపల్లిలో నాగేశ్వరరావుకు చెందిన వ్యవసాయ క్షేత్రాన్ని అనిశా అధికారులు పరిశీలించారు. పొలం మధ్యలో అత్యంత విలాసవంతంగా రెండు గదులతో కూడిన ఫాంహౌస్‌ ఉంది. అక్కడికి వెళ్లడానికి గేటు నుంచి నిర్మించిన పొడవైన మెటల్‌ రోడ్డు పూర్తిగా ప్రభుత్వ నిధులతో వేసినట్లుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అసలు ఆ రోడ్డు నిర్మించిన ప్రాంతంలో గతంలో కొండవాగు(గోర్జ) ఉండేదని, దాన్ని కప్పేసి రహదారి నిర్మించారని విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది. అక్కడే రాత్రి కాపలాదారు నివాసముండేందుకు మరో రెండు గదుల ఇల్లు, ఒక కారు షెడ్డు నిర్మాణంలో ఉన్నాయి. కొండతామరాపల్లి ఊరిలోంచి ఆయన తోటల వరకూ వేసిన సిమెంటు రోడ్డు సైతం ఆయన వ్యక్తిగత లబ్ధి కోసం వేసుకున్నదేనన్న విమర్శలు స్థానికంగా వినిపిస్తున్నాయి.
రూ.40 లక్షల సొమ్ము ఎలా వచ్చింది?
నాగేశ్వరరావు వ్యవసాయ క్షేత్రంలో దాదాపు 13 ఎకరాల్లో మామిడి, రేగు, బత్తాయి, జామ, అరటి, టేకు తోటలతో పాటు పుచ్చకాయ పాదులు పెంచుతున్నారు. తోటలన్నీ పూర్తిగా బిందుసేద్యంతో అనుసంధానించారు. అక్కడే రెండు సోలారు పంపుసెట్లు ఏర్పాటుచేసుకున్నారు. వాటిని ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేశారా…? సొంత నిధులతోనే పెట్టుకున్నారా అని విచారిస్తున్నారు. మొత్తంగా వ్యవసాయక్షేత్రంలో చేసిన ఏర్పాట్లు, ఫాంహౌస్‌కి పెట్టిన ఖర్చు తక్కువలో తక్కువ రూ.40 లక్షలు అయ్యి ఉంటుందని అంత సొమ్ము ఆయనకు ఎలా వచ్చిందన్న కోణంలోను ఆరా తీస్తున్నారు. అసలు ఆ 13 ఎకరాలు ఆయన పేరు మీదే ఉన్నాయా…? లేక ఇతరత్రా ఆక్రమణలున్నాయా… అన్న విషయాన్నీ పరిశీలిస్తున్నారు. విజయనగరం అనిశా సీఐ సతీష్‌ ఆధ్వర్యంలో వ్యవసాయక్షేత్రంలో సోదాలు చేశారు. ఈ నెల 19నే నాగేశ్వరరావుని అరెస్టు చేసి అనిశా కోర్టుకు తరలించగా రిమాండ్‌ విధించడంతో ప్రస్తుతం విశాఖపట్నం కేంద్రీయ కారాగారంలో ఆయన ఉన్నారు. ఆయన బెయిల్‌ మీద బయటకు రావాలంటే అదే క్యాడర్‌లో ఉన్న అధికారి సంతకం చేయాల్సి ఉండటంతో ఎవరూ ముందుకురావడం లేదని సమాచారం.

 

Related posts

Leave a Comment