రూ.10 వేల కోట్ల సామ్రాజ్యం

కుటీరంతో మొదలెట్టి.. కోట్లకు పడగలెత్తిన ఆశారాం బాపు
అహ్మదాబాద్‌
అత్యాచార కేసులో జీవితఖైదును ఎదర్కొంటున్న ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు.. ఆస్తుల విలువెంతో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే! బడా వ్యాపారవేత్తలను సైతం తలదన్నేలా.. కేవలం నాలుగు దశాబ్దాల్లోనే దాదాపు రూ.10వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని ఆయన నిర్మించుకున్నారు. గుజరాత్‌లోని సబర్మతి నదీతీరంలో ఓ కుటీరంతో మొదలుపెట్టి.. దేశవిదేశాల్లో 400కుపైగా ఆశ్రమాలను నడిపే స్థాయికి ఎదిగారు. ఇప్పుడు అత్యాచార కేసులో దోషిగా తేలి.. అధఃపాతాళానికి పడ్డారు.
చదివింది నాలుగో తరగతే..
ఆశారాం అసలు పేరు ఆసూమల్‌ సిరూమలానీ. పాకిస్థాన్‌లోని సింధ్‌ ప్రావిన్సులో 1941 ఏప్రిల్‌ 17న జన్మించారు. 1947లో దేశ విభజన తర్వాత తల్లిదండ్రులతోపాటు అహ్మదాబాద్‌కు వచ్చారు. ఆశారాం చదువు నాలుగో తరగతితోనే ఆగిపోయింది. తండ్రి మరణించడంతో పదేళ్ల వయసులో తప్పనిసరై ఆయన విద్యాభ్యాసం ఆపేశారు. తన తండ్రి నిర్వహించిన బొగ్గు, కలప వ్యాపారాన్ని కొంతకాలం కొనసాగించారు. ఆశారాంకు తన 15వ ఏట లక్ష్మీదేవి అనే మహిళతో వివాహమైంది. వీరికి కుమారుడు నారాయణ్‌ సాయి, కుమార్తె భారతీదేవి ఉన్నారు. పెళ్లికి ఎనిమిది రోజుల ముందే భరూచ్‌లోని ఓ ఆశ్రమానికి ఆశారాం పారిపోయినప్పటికీ.. చివరికి వీరి వివాహం జరిగిందని ఆయన జీవితచరిత్ర పుస్తకాలు పేర్కొన్నాయి. చిన్నాచితకా పనులు చేసిన అనంతరం ‘ఆధ్యాత్మిక అన్వేషణ’ కోసం ఆశారాం హిమాలయాలకు వెళ్లారని.. అక్కడే తన గురువు లీలా షాను కలుసుకున్నారని తెలిపాయి. 1964లో ఆసూమల్‌కు ‘ఆశారాం’ అని నామకరణం చేసి శిష్యుడిగా లీలా షా స్వీకరించారని.. ‘తనదైన మార్గం ఏర్పరుచుకుని జనాలను ఆ బాటలో నడిపించాల’ని ఆదేశించారని వెల్లడించింది.
దేశవిదేశాల్లో 400 ఆశ్రమాలు
అహ్మదాబాద్‌లో సబర్మతి నదీతీరంలోని మోటెరాలో 1972లో ‘మోక్ష కుటీరం’ పేరుతో చిన్న గుడిసెను నిర్మించుకుని.. ఆశారాం ధ్యానం ప్రారంభించారు. కొద్ది రోజుల్లోనే అక్కడికి ప్రజలు వరుస కట్టడం మొదలుపెట్టారు. ‘సంత్‌ ఆశారాం బాపు’గా ఆయన పేరు మార్మోగడం మొదలైంది. ఆ గుడిసె పూర్తి స్థాయి ఆశ్రమంగా రూపాంతరం చెందడానికి పెద్దగా సమయం పట్టలేదు. క్రమంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆశారాం ఆశ్రమాలు వెలిశాయి. 1981లో కాంగ్రెస్‌, 1999లో భాజపా ప్రభుత్వాలు.. ఆశ్రమాలను విస్తరించుకునేందుకు ఆశారాంకు భూములను కేటాయించాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఆశారాంకు 400కుపైగా ఆశ్రమాలున్నాయి. గురుకులాల పేరుతో పాఠశాలలనూ ఆయన నెలకొల్పారు. జోధ్‌పుర్‌, ఛింద్వాడా, ఇండోర్‌, రోహ్‌తక్‌, అహ్మదాబాద్‌ల్లో వందలాది ఎకరాల్లో ఇవి విస్తరించి ఉన్నాయి. 2013లో ఆశారాం తొలిసారి అరెస్టైనప్పుడు.. మోటెరా ఆశ్రమంలో అధికారులు నిర్వహించిన సోదాల్లో విస్తుపోయే వివరాలు వెలుగుచూశాయి. భవనాలు, షేర్లు, వడ్డీ వ్యాపారం, ఆయుర్వేద ఉత్పత్తుల అమ్మకాలు, ఆధ్యాత్మిక పుస్తకాల విక్రయాల ద్వారా ఆశారాం రూ.వేల కోట్లు సంపాదించినట్లు వెల్లడైంది. భారీ ఎత్తున భూ స్థలాలు ఆయన పేరిట ఉన్నాయని.. వీటిని కలపకుండానే ఆయన ఆస్తుల విలువ రూ.10వేల కోట్లు ఉంటుందని తేలింది.

అత్యాచార కేసుతో పతనం
2008లో ఆశారాం తొలిసారి చిక్కులపాలయ్యారు. మోటెరా ఆశ్రమంలోని గురుకులంలో ఉండే ఇద్దరు యువకులు.. స్థానిక నదిలో శవాలై తేలారు. ఆశ్రమంలో క్షుద్రపూజలు జరుగుతున్నాయని బయటపెట్టినందుకే వారిని నరికిచంపారని మృతుల కుటుంబసభ్యులు ఆరోపించారు. దీంతో ఆశ్రమంలోని ఏడుగురు వ్యక్తులపై 2009లో సీఐడీ హత్య కేసు నమోదు చేసింది. ఆశారాం అసలు పతనం మొదలైంది మాత్రం 2013లోనే. రాజస్థాన్‌లో ఓ మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయన అరెస్టయ్యారు. ఆశారాం, ఆయన కుమారుడు తమను లైంగికంగా పీడించారని.. అదే ఏడాది అక్టోబర్‌లో సూరత్‌కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాంధీనగర్‌ కోర్టులో ఈ కేసు విచారణ సాగుతోంది. సూరత్‌, అహ్మదాబాద్‌ల్లో భూ కబ్జా కేసులను ఆశారాం ఎదుర్కొంటున్నారు. ఇటు ఆధ్యాత్మిక గురువు అవతారం ఎత్తకముందు.. మద్యం విక్రయించడం, టీ అమ్మడం, సైకిళ్లకు మరమ్మతులు చేయడం వంటి పనులూ ఆశారాం చేశారనే ప్రచారం ఉంది. అజ్మేర్‌లోని రైల్వే స్టేషన్‌ నుంచి అజ్మేర్‌ శరీఫ్‌ దర్గాకు యాత్రికులను గుర్రపు బండిలో తరలిస్తూ ఆయన ఉపాధి పొందేవారని కూడా కొందరు చెబుతుంటారు.

‘నిర్భయ ఘటన’పై కారుకూతలు!
దిల్లీలో 2012లో చోటుచేసుకున్న ‘నిర్భయ ఘటన’ గురించి ఆశారాం చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారం రేపాయి. కదులుతున్న బస్సులో ఆరుగురు కిరాతకులు అత్యంత పాశవికంగా యువతిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన ఈ ఘటనలో.. నిందితులతో సమానంగా బాధితురాలిది కూడా తప్పు ఉందంటూ ఆయన నిందించడం వివాదాస్పదమైంది. ‘‘బాధితురాలు కూడా నిందితులతో సమానమైన దోషే. నిందితులను ‘అన్నా’ అని పిలిచి.. అత్యాచారం చేయొద్దని ఆమె వేడుకోవాల్సింది. ఆమె పరువు, జీవితం సురక్షితంగా ఉండేవి. ఒక్క చేత్తో చప్పట్లు కొట్టడం సాధ్యం కాదనే అనుకుంటున్నా’’ అంటూ ఆ ఘటన గురించి ఆశారాం వ్యాఖ్యానించారు. దీనిపై తీవ్ర ప్రజాగ్రహాన్ని ఆయన చవిచూడాల్సి వచ్చింది. అనంతరం తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ ఆశారాం వివరణ ఇచ్చుకున్నారు.

Related posts

Leave a Comment