‘ప్రగతి ప్రాంగణం’గా తెరాస ప్లీనరీ వేదిక

ఆరు అడుగుల ఎత్తు.. 60 మంది కూర్చునే వీలు
సీఎం కేసీఆర్‌ బసకు గదులు సిద్ధం
రెండురోజుల ముందే పూర్తయిన ఏర్పాట్లు
నగరమంతా పార్టీ జెండాలు, స్వాగత తోరణాలు
ఈ నెల 27న హైదరాబాద్‌ కొంపల్లిలో జరగనున్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా రెండురోజుల ముందే అక్కడ అన్ని సౌకర్యాలను కల్పించారు. వేదికకు ‘ప్రగతి ప్రాంగణం’గా నామకరణం చేశారు. ఆరు అడుగుల ఎత్తయిన ప్లీనరీ వేదికను 60 మంది కూర్చునేలా తీర్చిదిద్ది, గులాబీ రంగుతో అలంకరించారు.
వేర్వేరుగా గ్యాలరీలు
దాదాపు ఎనిమిది ఎకరాల స్థలంలో ఎకరం ప్రాంగణానికి కేటాయించగా..మిగిలిన దానిని పార్కింగు, భోజన శాలలకు కేటాయించారు. ప్లీనరీ ప్రాంగణం ఇప్పటికే సిద్ధమైంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల ఛైర్మన్లు కూర్చునేందుకు వేర్వేరుగా గ్యాలరీలను గుర్తించారు. గురువారం నాటికి ఆయా ప్రాంతాల్లో కుర్చీలు, సోఫాలను ఏర్పాటు చేస్తారు. ప్రాంగణం వద్ద సీఎం బసకు వీలుగా గదులలో ఏర్పాట్లు చేయడంతోపాటు… బ్యారికేడ్లను అమర్చారు. వాహనాలు నిలిపేందుకు వీలుగా సౌకర్యాలు కల్పించారు. వేసవి తాపం దృష్ట్యా వేదిక, ప్రాంగణంలో కూలర్లను అమర్చారు. పార్టీ శ్రేణుల కోసం మజ్జిగ, నీరు, అంబలి కేంద్రాలను సిద్ధం చేశారు.

స్వాగత తోరణాలు
ప్లీనరీని పురస్కరించుకొని పార్టీ కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మేయరు బొంతు రామ్మోహన్‌ల ఆధ్వర్యంలో వేదిక, ప్రాంగణంతోపాటు.. రాజధానికి నలువైపులా ఫ్లెక్సీలు, కటౌట్లు, జెండాలు, స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్‌ స్టాండులు, షెల్టర్లు, ప్రధాన కూడళ్లు, మెట్రో పిల్లర్లు, ఆర్టీసీ బస్సులపైనా చిత్రపటాలను అతికించారు. వేదిక ప్రాంగణం, తెలంగాణభవన్‌ వద్ద తెరాస బెలూన్లను ఎగురవేశారు. ప్రచార చిత్రాలలో కేసీఆర్‌ చిత్రాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలను పొందుపరిచారు. వేదిక ప్రాంగణం వద్ద పువ్వు ఆకారంలో రూపొందించిన కేసీఆర్‌ చిత్రపటాల సమాహారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది

Related posts

Leave a Comment