కామాంధులపై పోక్సో అస్త్రం

నలుగురికి జీవిత ఖైదు…
ఏడాదిలో 30 మందికి జైలు శిక్ష
చిన్నారులపై లైంగిక దాడుల కేసుల్లో మెరుగైన పోలీస్‌ పరిశోధన
చిన్నారులపై అత్యాచారాలు, లైంగిక దాడుల సంఘటనలపై హైదరాబాద్‌ పోలీసులు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. కామాంధులపై పోక్సో-2012 చట్టం ప్రయోగించి వారికి శిక్ష పడేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఎక్కడైనా సరే అత్యాచారాలు, లైంగికదాడుల ఫిర్యాదులు వస్తే నేరుగా భరోసా కేంద్రానికి పంపించాలంటూ పోలీస్‌ ఠాణాల అధికారులకు సూచించారు. గతేడాదిలో 126 కేసులు నమోదు చేస్తే, అందులో 30 మందికి శిక్ష పడేలా న్యాయస్థానంలో పక్కా సాక్ష్యాధారాలు సమర్పించారు. నలుగురికి జీవిత ఖైదు కూడా పడింది.
మెట్రోనగరాలు దిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు తరహాలోనే హైదరాబాద్‌లోనూ క్రమంగా లైంగికదాడులు, అత్యాచారాలు పెరుగుతున్నాయని, బాధితుల్లో ఎక్కువగా పాఠశాలల విద్యార్థులు, మురికివాడల్లో ఉంటున్నవారు, దుకాణాలు, ఇళ్లల్లో పనులు చేసేందుకు వెళ్లే మైనర్లు ఉంటున్నారని పోలీసులు గుర్తించారు. కేసులు నమోదు చేశాక న్యాయస్థానాల్లో వాయిదాలకు వెళ్తున్నారు తప్ప శిక్షలపై దృష్టి సారించడం లేదని అంతర్గతంగా విశ్లేషించుకున్నారు. దుర్మార్గులు శిక్ష అనుభవించాలంటే పోక్సో(లైంగిక దాడుల నుంచి చిన్నారుల రక్షణ చట్టం) సమర్థంగా వినియోగించుకోవాలని నిర్ణయించారు. అప్పటి నుంచి ఈ చట్టం కింద కేసు నమోదు చేస్తున్నారు. పక్కాగా సాక్ష్యాధారాలను సేకరించడంతో పాటు ఈ కేసులను ప్రత్యేకంగా పరిగణించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థిస్తున్నారు.

తొమ్మిదేళ్ల చిన్నారిపై అత్యాచారం… జీవితఖైదు
సికింద్రాబాద్‌లోని ఓ కాలనీలో ఉంటున్న దంపతులకు తొమ్మిదేళ్ల కుమార్తె ఉంది. భర్త చిన్నపనులు చేస్తుండగా… భార్య కూరగాయల వ్యాపారం చేస్తుండేంది. వీటిని మార్కెట్‌ నుంచి తెచ్చుకునేందుకు భర్త స్నేహితుడు నర్సింగ్‌(53) ఆటోలో వెళ్తుండేది. డిసెంబరు 19, 2016న తల్లి, కుమార్తెలు నర్సింగ్‌ ఆటోలో కూరగాయల మార్కెట్‌కు వెళ్లారు. తల్లి కూరగాయలు తెచ్చుకునేందుకు వెళ్లగా… ఆటోలో ఉన్న చిన్నారిపై నర్సింగ్‌ అత్యాచారం చేసి తల్లికి చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. అదే ఆటోలో ఇంటికి వెళ్లాక నొప్పిని భరించలేని చిన్నారి తల్లికి విషయాన్ని వివరించింది. బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నర్సింగ్‌ను అరెస్ట్‌ చేసి జైలుకు పంపించారు. అనంతరం శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలతో నాంపల్లి కోర్టులో అభియోగాలు సమర్పించారు. కేసు ప్రాధాన్యం దృష్ట్యా వేగంగా విచారించాలని అభ్యర్థించారు. ఏడాది పాటు విచారించిన అనంతరం కామాంధుడు నర్సింగ్‌కు జీవితఖైదుతో(పదేళ్లు) పాటు రూ.3వేలు జరిమానా విధిస్తూ ఈ ఏడాది జనవరిలో తీర్పు ప్రకటించింది.

చిన్నారులు, బాల బాలికలపై కేసులు నమోదు చేసినప్పటి నుంచి వారికి న్యాయం జరిగేంత వరకూ అండగా ఉంటున్నాం. బాధితుల ఆరోగ్య పరిస్థితి, మానసిక స్థితిని పరిగణనలోకి తీసుకుని భరోసా కేంద్రంలో వారికి సాంత్వన కలిగేలా చర్యలు చేపట్టాం. ఇటీవల ఓ అత్యాచార బాధితురాలు షాక్‌తో మతి స్థిమితం కోల్పోగా… ఏడాదిపాటు మెరుగైన వైద్యచికిత్సలు అందించి మామూలు అమ్మాయిగా మార్చాం. చిన్నారి తల్లిదండ్రులకు ఆర్థిక స్తోమత లేకపోవడంతో ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో ఆ బాలికను చేర్పించాం. ఇక బాధితులకు ప్రభుత్వ పరంగా వచ్చే నష్టపరిహారాన్ని ఇప్పిస్తున్నాం.

 

Related posts

Leave a Comment