నగదు కొరత ఎన్నాళ్లు?

విధాన లోపాల వల్లే సమస్య
కేంద్రం, ఆర్బీఐ సమగ్ర విధానం తయారుచేయాలి
బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
కొరత తీర్చాలని తీర్మానం

నగదు కొరతకు కారణమేంటి? సమస్య ఎక్కడుంది? ఎందుకొస్తోంది.. ఎలా అధిగమించాలి? అని ముఖ్యమంత్రి చంద్రబాబు బ్యాంకర్లను ప్రశ్నించారు. పెద్దనోట్ల రద్దు సమయంలో సరే.. ఎప్పుడూ ఇదే సమస్య అయితే ఎలాగని అన్నారు. ప్రభుత్వపరంగా సూక్ష్మపోషకాలు, యాంత్రీకరణ, ఇతర రాయితీలు అందిస్తున్నా నగదు సమస్య ఉంటే రైతులు ఇబ్బంది పడతారని గుర్తుచేశారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం ఉండవల్లిలోని ప్రజాదర్బార్‌ మందిరంలో గురువారం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో నగదు సమస్య పరిష్కారానికి రిజర్వుబ్యాంకు, ఆర్థికశాఖ సమగ్ర విధానం రూపొందించాలని సమావేశంలో తీర్మానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. సాంకేతికంగా మనం ముందున్నా డిజిటల్‌ లావాదేవీల విషయంలో వెనుకబాటుకు విధానపరమైన లోపాలే ప్రధాన కారణమని పేర్కొన్నారు. కేంద్రం, రిజర్వు బ్యాంకు దీనిపై దృష్టి సారించాలని సూచించారు. ఖాతాదారుల లావాదేవీలకు హామీ ఉండాలన్నారు. నగదు కొరత పరిష్కారానికి ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని ఆర్థిక శాఖ డీడీజీ అంజనాదూబే చెప్పారు. దీనిపై ఏర్పాటైన కమిటీ రోజూ సమీక్షిస్తోందని వివరించారు. 2016 నవంబరు నుంచి గతేడాది మార్చి మధ్య హైదరాబాద్‌లోని ఆర్‌బీఐ ప్రాంతీయ కేంద్రానికే పెద్ద మొత్తంలో సొమ్ము వచ్చిందని వివరించారు. ఏప్రిల్‌ 2017 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఇతర రాష్ట్రాలకంటే ఆంధ్రప్రదేశ్‌కే ఎక్కువ సొమ్ము వచ్చిందన్నారు.

నగదు చలామణి తగ్గింది
గతంతో పోలిస్తే నగదు చలామణి తగ్గిందని సమావేశానికి హాజరైన భారతీయ రిజర్వుబ్యాంకు ప్రాంతీయ మేనేజర్‌ సుబ్రమణ్యన్‌ చెప్పారు. గతంలో ఖాతా నుంచి రూ.20వేలు తీసుకుంటే రూ.2వేలు పొదుపు చేసి మిగిలిన రూ.18వేలు ఖర్చుకు వినియోగించేవారని అన్నారు. ఇప్పుడు రూ.18వేలు పొదుపు చేసి మిగిలిన రూ.రెండు వేలు చలామణి చేస్తున్నారని వివరించారు. సాధారణంగా బ్యాంకులకు 50 నుంచి 60శాతం ఖాతాదారుల లావాదేవీల నుంచి, 30 నుంచి 40శాతం రిజర్వుబ్యాంకు నుంచి వస్తుంటాయని, ఇప్పుడా పరిస్థితి తారుమారైందని తెలిపారు. రాష్ట్రానికి రూ.500కోట్ల కొత్తనోట్లు వచ్చాయని ప్రకటించారు. ఈ మొత్తం పింఛన్ల పంపిణీకే సరిపోవని సీఎం వ్యాఖ్యానించారు. 4 నుంచి 6 వారాల్లో నగదు సమస్య పరిష్కారమవుతుందని అధికారి సుబ్రమణ్యన్‌ అన్నారు. వినియోగ రుసుములు, డబ్బు తీయడంపై నియంత్రణ, కార్డులపై అదనపు రుసుములు, ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లు కారణంగానే ఉద్యోగులు జీతం సొమ్ము మొత్తాన్ని బయటకు తెస్తున్నారని ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఈ సందర్భంగా ప్రస్తావించారు.రాష్ట్రంలో 10,379 ఏటీఎంలు ఉంటే 79% కేంద్రాల్లో నగదు అందుబాటులో ఉందని డీడీజీ చెప్పారు. భారతీయ స్టేట్‌బ్యాంకు పరిధిలోని 85% ఏటీఎంలలో కొరత లేదని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో డిజిటల్‌ నగదు చలామణి 34శాతమని వివరించారు.

Related posts

Leave a Comment