కాంగ్రెస్, బీజేపీతో ఒరిగిందేమీలేదు

congress, ktr, bjp, election 2018

కాంగ్రెస్‌ను నమ్మి చేతి గుర్తుకు ఓటేస్తే దేశ ప్రజలకు చెయ్యిచ్చింది. ఏదో చేస్తుందన్న ఆశతో బీజేపీకి ఓటేస్తే ఆ పార్టీ ప్రజల చెవిలో పూలు పెట్టింది. అసలు ఈ రెండు పార్టీలతో దేశానికి ఒరిగిందేమిటి? అని మంత్రి కే తారకరామారావు ప్రశ్నించారు. నోట్లరద్దుతో ప్రజలను ఎన్డీయే ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసిందని, నల్లధనాన్ని బయటకుతెచ్చి ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షల చొప్పున జమచేస్తామన్న మాటను నిలుపుకోలేదని విమర్శించారు. ఆదివారం తెలంగాణభవన్‌లో అగర్వాల్, జైన్, మహేశ్వరీలకు చెందిన వివిధ సంఘాల ప్రతినిధులు పెద్దఎత్తున మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఇంటి కిరాయి చెల్లిస్తామని ఇచ్చిన హామీని మంత్రి ప్రస్తావిస్తూ.. ఇంకా నయం సోఫా కవర్లు మేమే మారుస్తాం, పాత పేపర్లు అమ్మిపెడుతామని చెప్పలేదంటూ ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ భావితరాల భవిష్యత్, ప్రస్తుత తరాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ హయాంలో వారానికి రెండురోజులు పవర్‌హాలిడేతో పరిశ్రమలు మూతపడి వేలమంది కార్మికులు వీధుల పాలయ్యారని, కానీ టీఆర్‌ఎస్ హయాంలో అన్నిరంగాలకు 24 గంటల విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని మంత్రి చెప్పారు.

కాంగ్రెస్ పాలనలో ముగ్గురేసి సీఎంలు
కాంగ్రెస్‌లో 40 మంది సీఎం అభ్యర్థులు ఉన్నారని, 1989 -1994, 2009-2014 మధ్య ఒక్క టర్మ్‌లోనే ముగ్గురేసి చొప్పున ముఖ్యమంత్రులను మార్చిందని, సుస్థిరపాలన ఆ పార్టీ వల్ల కాదని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ది సీల్డ్ కవర్ రాజకీయమని విమర్శించారు. ఉమ్మడి పాలకులు తెలంగాణ వస్తే హైదరాబాద్‌లో శాంతిభద్రతలు ఉండవని, వివిధ రాష్ర్టాల నుంచి వచ్చినవారిని ఇక్కడినుంచి వెళ్లగొట్టి శివసేనలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని విషప్రచారం చేశారు. కానీ, ప్రశాంత వాతావరణం, భద్రతకు భరోసా ఇవ్వడంలో దేశానికే తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచింది. 1921లో మహాత్మాగాంధీ హైదరాబాద్ ప్రజల జీవన సౌందర్యాన్ని చూసి గంగా జమునా తెహజీబ్‌గా అభివర్ణించారు. దాన్ని తెలంగాణ ప్రభుత్వం రుజువు చేసింది. గత ప్రభుత్వాల పాలనను, టీఆర్‌ఎస్ పాలనను బేరీజు వేసుకొని కేసీఆర్ నాయకత్వాన్ని ఆశీర్వదించాలి అని మంత్రి పిలుపునిచ్చారు. విశ్వనగర వికాసానికి రూ.50 వేలకోట్లతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.
Tags: congress, ktr, bjp, election 2018

Related posts

Leave a Comment