జీపీ రెడ్డి ఇంట్లో సోదాలు.. పోలీసులను అడ్డుకున్న లగడపాటి

జీపీ రెడ్డి ఇంట్లో సోదాలు.. పోలీసులను అడ్డుకున్న లగడపాటి

నగరంలోని ఓ ప్రముఖ వ్యాపారి ఇంట్లో పోలీసులు హల్‌చల్ చేశారు. ఎలాంటి వారెంట్ లేకుండా సోదాలు నిర్వహించేందుకు వెళ్లారు. వాళ్ల తీరుపై మాజీ ఎంపీ లగడపాటి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌ రోడ్ నెం.65లోని ప్రముఖ వ్యాపారవేత్త జీపీ రెడ్డి ఇంట్లో గురువారం అర్ధరాత్రి వెస్ట్‌జోన్ డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. సివిల్ కేసు విచారణ అంటూ పోలీసులు ఈ సోదాలు నిర్వహించారు. అయితే, పోలీసులు ఎలాంటి వారెంట్ చూపించకుండా ఇంట్లోకి ప్రవేశించారని సమాచారం.

ఈ క్రమంలో రంగప్రవేశం చేసిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ సోదాలు చేయడానికి వచ్చిన పోలీసులను అడ్డుకున్నారు. సెర్చ్‌ వారెంట్‌ లేకుండానే సోదాలు ఎలా నిర్వహిస్తారని ఆయన పోలీసులను ప్రశ్నించారు. అనంతరం లగడపాటి ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. జీపీరెడ్డి ఇంట్లో పోలీసుల తనిఖీలపై ఈ సందర్భంగా లగడపాటి రాజగోపాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సెర్చ్‌ వారెంట్‌ లేకుండానే తన మిత్రుడిని పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐజీ నాగిరెడ్డి భూవిషయంలో జీపీరెడ్డిని పోలీసులు బెదిరిస్తున్నారని, ఆయనకు అనుకూలంగానే పోలీసులు వ్యవహరిస్తున్నారని లగడపాటి ఆరోపించారు. అర్ధరాత్రి ఇళ్లలో చొరబడి సోదాలు చేయమని చట్టం చెబుతుందా అని ప్రశ్నించిన ఆయన, పోలీసుల తీరుపై గవర్నర్‌, ఈసీకి ఫిర్యాదు చేస్తానని తెలిపారు.

Related posts

Leave a Comment