అదిగో విజయం!

దిల్లీలో ఆఖరి పంచ్‌కు టీమ్‌ ఇండియా సిద్ధమైపోయింది. మూడో టెస్టును గెలవడం దాదాపుగా లాంఛనమే. లంకేయులు అద్భుతం చేస్తే తప్ప.. రికార్డు స్థాయిలో వరుసగా తొమ్మిదో సిరీస్‌ భారత్‌ సొంతమైనట్లే! 410… కోహ్లి, రోహిత్‌, ధావన్‌ ధాటిగా ఆడడంతో భారత్‌.. లంక ముందుంచిన లక్ష్యమిది. కనీసం పోరాటానికే కష్టపడుతున్న ఈ పరిస్థితుల్లో శ్రీలంకకు ఈ కొండంత స్కోరును అందుకోవడం అసంభవమే. కనీసం డ్రా కూడా కష్టమేనని నాలుగో రోజు ఆట చివరికి తేలిపోయింది. తేలాల్సింది గెలుపు అంతరమే! విజయానికి భారత్‌కు కావాల్సింది ఏడు వికెట్లే కాగా.. లంక చేయాల్సింది 379 పరుగులు. జడేజా విజృంభిస్తున్న వేళ.. అస్థిరంగా బౌన్స్‌ అవుతున్న పిచ్‌ లంకేయలను మరింత కఠినంగా పరీక్షంచనుంది.

తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక పోరాటం భారత్‌కు సవాల్‌ విసిరేందుకు ఏమాత్రం సరిపోలేదు. జోరు కొనసాగించిన కోహ్లీసేన ఆఖరి టెస్టులో ఘనవిజయం దిశగా దూసుకెళ్తోంది. నాలుగోరోజు, మంగళవారం 410 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 31 పరుగులకే మూడు వికెట్లు చేజార్చుకుంది. రోహిత్‌ శర్మ (50 నాటౌట్‌; 49 బంతుల్లో 5×4), విరాట్‌ కోహ్లి (50; 58 బంతుల్లో 3×4), శిఖర్‌ ధావన్‌ (67; 91 బంతుల్లో 5×4, 1×6) ధాటిగా ఆడడంతో అంతకుముందు భారత్‌ 246/5 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. ఉదయం 356/9తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన లంకను 373 పరుగులకు ఆలౌట్‌ చేసిన టీమ్‌ ఇండియా..163 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించింది. చండిమాల్‌ (164) ఓవర్‌నైట్‌ వ్యక్తిగత స్కోరుకు 17 పరుగులు జోడించి ఔటయ్యాడు.

Related posts

Leave a Comment