అలవోకగా కొట్టేశారు..

ఫార్మాట్‌ మారినా టీమ్‌ఇండియాది అదే జోరు. పొట్టి క్రికెట్లోనూ అదే పట్టు. అన్ని రంగాల్లోనూ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన భారత్‌.. లంకపై ఈసారి మరింత నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడింది. ప్రత్యర్థి కనీస పోటీ ఇవ్వలేకపోయిన వేళ.. కటక్‌లో అంతా ఏకపక్షమే. బ్యాటుతో దంచేసి.. స్పిన్‌తో చుట్టేసి టీ20 సిరీస్‌లో ఘనంగా బోణీ కొట్టింది భారత్‌. పరుగుల పరంగా టీ20ల్లో భారత్‌కు ఇదే అతి పెద్ద విజయం. యువ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ తన మాయాజాలంతో
లంక పతనాన్ని శాసించాడు.

టీ20 సిరీస్‌లో భారత్‌కు అదిరే ఆరంభం. బుధవారం జరిగిన మ్యాచ్‌లో సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన టీమ్‌ ఇండియా 93 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చిత్తుగా ఓడించింది. కేఎల్‌ రాహుల్‌ (61; 48 బంతుల్లో 7×4, 1×6), ధోని (39 నాటౌట్‌; 22 బంతుల్లో 4×4, 1×6), మనీష్‌ పాండే (32 నాటౌట్‌; 18 బంతుల్లో 2×4, 2×6) మెరవడంతో మొదట భారత్‌ 3 వికెట్లకు 180 పరుగులు సాధించింది. ఛేదనలో భారత స్పిన్నర్లు చాహల్‌ (4/23), కుల్‌దీప్‌ యాదవ్‌ (2/18) ధాటికి విలవిలలాడిన శ్రీలంక.. 16 ఓవర్లలో 87 పరుగులకే కుప్పకూలింది. తరంగ (23) ఆ జట్టు టాప్‌ స్కోరర్‌. చాహల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. రెండో టీ20 శుక్రవారం ఇండోర్‌లో జరుగుతుంది.

Related posts

Leave a Comment