ఆర్థిక నిబంధనలు సరళీకృతం

పెట్టుబడులకు సంబంధించి ఆర్థిక వ్యవహారాల విభాగం నిబంధనలను సరళీకృతం చేయాలని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి రాష్ట్ర పట్టణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు విజ్ఞప్తిచేశారు. బుధవారమిక్కడ పలువురు తెరాస ఎంపీలతో కలిసి కేంద్రమంత్రితో కేటీఆర్‌ భేటీ అయ్యారు. పసుపుబోర్డు, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ అంశాలపై కేంద్ర వాణిజ్యమంత్రి సురేశ్‌ప్రభుతో చర్చించారు. పారిశ్రామిక రంగంలో రావాల్సిన విధానపరమైన మార్పులపై నీతిఆయోగ్‌ అధికారులతో మాట్లాడారు. బీడబ్ల్యూ బిజినెస్‌ వరల్డ్‌ ఐదవ స్మార్ట్‌సిటీస్‌ కాన్‌క్లేవ్‌ అవార్డుల కార్యక్రమంలో ‘అర్బన్‌ లీడర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డును కేటీఆర్‌ అందుకొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘దేశంలో ఎదుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఇతర దేశాల నుంచి అనేక మంది రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థికవ్యవహారాల నిబంధనలను సరళీకృతం చేయాలని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి వివరించాం.

దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు. సమస్యలు పరిష్కరిస్తామని హామీఇచ్చారు. కేంద్ర వాణిజ్యమంత్రి సురేశ్‌ప్రభుతో భేటీ అయి రెండు అంశాలపై చర్చించాం. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ తెలంగాణకు ఇవ్వాలని కోరాం. విభజన అనంతరం ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిపోయిందని గుర్తుచేశాం. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ఎంపీ కల్వకుంట్ల కవిత పోరాటం చేస్తున్నారు. ఇదే విషయాన్ని మరోసారి సురేశ్‌ప్రభుకి చెప్పాం. జాతీయస్థాయిలో కాఫీబోర్డులా పసుపు బోర్డు తెలంగాణ కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరాం. భవిష్యత్తులో దీనిపై సమావేశం ఏర్పాటు చేస్తామని.. తప్పకుండా రావాలని కేంద్రమంత్రి ఆహ్వానించారు.

Related posts

Leave a Comment