క్రికెటర్ల జీతాలకు రెక్కలు!

టీమ్‌ఇండియా క్రికెటర్ల జీతాల సమస్య సుఖాంతమైంది! క్రికెటర్ల డిమాండ్‌లకు సుప్రీంకోర్టు నియమిత బీసీసీఐ పాలకుల కమిటీ (సీఓఏ) ఆమోదం తెలిపింది. భారత ఆటగాళ్ల తరఫున టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోని, ప్రధాన కోచ్‌ రవిశాస్త్రిలతో కూడిన బృందం.. సీఓఏ చీఫ్‌ వినోద్‌ రాయ్‌, సభ్యురాలు డయానా ఎడుల్జి, బీసీసీఐ సీఈఓ రాహుల్‌ జోహ్రిలతో గురువారం సమావేశమైంది. క్రికెటర్ల వేతనాల పెంపు, మ్యాచ్‌ల షెడ్యూల్‌, విదేశీ పర్యటనలతో పాటు వివిధ అంశాలపై భారత జట్టు ప్రతినిధులు బోర్డు పాలకులతో చర్చించారు. జీతాల పెంపుపై రెండు బృందాలు ఒక అవగాహనకు వచ్చినట్లు వినోద్‌ రాయ్‌ చెప్పాడు. ‘‘చాలా అంశాలపై చర్చించాం. ఏడాదిలో క్రికెటర్లు ఆడాల్సిన మ్యాచ్‌లు… భవిష్య పర్యటనల కార్యక్రమంతో పాటు, ఆటగాళ్ల ప్యాకేజీల గురించి చర్చించాం. ఆట అభివృద్ధికి సంబంధించి ఇతరులకు మార్గదర్శకంగా నిలిచే పరిష్కారాన్ని కనుగొన్నాం. బోర్డు ఆదాయం నుంచి ఆటగాళ్లకు ఏ మేరకు చెల్లింపులు చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’’ అని వినోద్‌ రాయ్‌ వివరించాడు. ఇటీవలే ఆటగాళ్ల వార్షిక జీతాలను బీసీసీఐ భారీగా పెంచింది. ప్రస్తుతం గ్రేడ్‌-ఎ ఆటగాడికి ఏడాదికి రూ.

2 కోట్లు.. గ్రేడ్‌-బి ఆటగాడికి రూ. కోటి.. గ్రేడ్‌-సి ఆటగాడికి రూ. 50 లక్షలు అందుతోంది. టెస్టు మ్యాచ్‌ తుది జట్టులోని వారికి రూ. 15 లక్షలు.. వన్డే తుది జట్టులోని వారికి రూ. 6 లక్షలు, టీ20 మ్యాచ్‌ తుది జట్టులోని వారికి రూ. 3 లక్షల మ్యాచ్‌ ఫీజు అందుతోంది. జట్టులో ఉండి మ్యాచ్‌ ఆడని మిగతావారికి ఆయా ఫార్మాట్ల మ్యాచ్‌ ఫీజులో సగం మొత్తం పొందుతారు. ఐతే గతంలో అనిల్‌ కుంబ్లే గ్రేడ్‌-ఎ ఆటగాళ్లకు రూ. 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. కోహ్లి కూడా ఆటగాళ్ల వార్షిక జీతాలు పెంచాల్సిన అవసరముందని అన్నాడు. చెతేశ్వర్‌ పుజారాలా కేవలం టెస్టు క్రికెట్‌కే పరిమితమైన ఆటగాళ్లు నష్టపోకుండా ఉండేలా వేతన ఒప్పందాలను సవరించే అవకాశముంది. సిరీస్‌ల మధ్యలో ఆటగాళ్లకు తగినంత విరామం ఉండేలా చూసేందుకు సీఓఏ అంగీకారం తెలిపిందని సమాచారం. వచ్చే ఏడాది జులైలో ఇంగ్లాండ్‌ పర్యటనకు టీమ్‌ఇండియా రెండు వారాల ముందే వెళ్లనుందని బోర్డు వర్గాలు తెలిపాయి. అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి లభించడం లేదని కోహ్లి ఆరోపించిన సంగతి తెలిసిందే. శ్రీలంకతో సిరీస్‌ ముగిసిన రెండు రోజుల్లో భారత జట్టు డిసెంబరు 27న దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది.

 

Related posts

Leave a Comment