సుహాసిని ఎంపిక వెనక టీడీపీ భారీ వ్యూహం!

నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినిని కూకట్‌పల్లి నుంచి ఎన్నికల బరిలోకి దింపడం వెనక భారీ వ్యూహం దాగి ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. స్థానికంగా కూడా ఎన్టీఆర్ కుటుంబంపై సానుకూలత ఉంది. కాబట్టి ఈ ఎన్నికల్లో ఎన్టీఆర్ కుటుంబం నుంచి వ్యక్తిని బరిలోకి దింపడం వల్ల ఆ ప్రభావం మొత్తం మహాకూటమి అభ్యర్థులపై పడుతుందని చెబుతున్నారు. వారి గెలుపునకు కూడా దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

హరికృష్ణ మరణించినప్పుడు చంద్రబాబు రెండు రోజుల పాటు హైదరాబాద్‌లోనే ఉండి అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. ఇప్పుడు సుహాసినిని బరిలోకి దింపడం వల్ల హరికృష్ణ కుటుంబానికి పార్టీ అండగా నిలిచిందని, ఆయన రాజకీయ వారసత్వాన్ని టీడీపీ కొనసాగిస్తోందన్న అభిప్రాయం ప్రజల్లోకి తీసుకెళ్లినట్టు అవుతుందని భావిస్తున్నారు. ఎన్టీఆర్ వారసురాలిగా కూకట్‌పల్లిలో ఆమె గెలుపు నల్లేరుమీద నడక కాగలదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, బీజేపీ నేత పురందేశ్వరి తప్ప ఎన్టీఆర్ కుటుంబం మొత్తం ఏకతాటిపై ఉందన్న సంకేతాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లినట్టు అవుతుందని భావిస్తున్నారు.

Related posts

Leave a Comment